
షెడ్యూలు అక్కరలేదట!
డైట్‌సెట్ ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత రాకపోవడంతో విద్యా సంవత్సరం నష్టపోతామనే భయం వారిని వెన్నాడుతోంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలు మాత్రం నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే యాజమాన్య కోటా సీట్లకు బేరసారాలు సాగిస్తున్నాయి. కౌన్సెలింగ్‌లో సీటు వస్తుందో.. రాదో తెలియని సంకట స్థితిలో యాజమాన్యాల డిమాండుకు విద్యార్థులు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
ఈ యేడాది జూన్ 15న జరిగిన డైట్‌సెట్-2014కు (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) జిల్లా నుంచి 43,037 మంది దరఖాస్తు చేసుకోగా 40,354 మంది పరీక్షకు హాజరయ్యారు. నవంబర్ మొదటివారంలో ఫలితాలు వెలువడినా కౌన్సెలింగ్ షెడ్యూలుపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. రెండేళ్ల డీఎడ్‌కు సంబంధించి ఇప్పటికే ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు కూడా ముగిసినా మొదటి సంవత్సరం ప్రవేశాలపై స్పష్టత రావడం లేదు.
షెడ్యూలుపై స్పష్టత లేకపోవడంతో అటు డిగ్రీలో చేరలేక, ఇటు కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూడలేక విద్యార్థులు అయోమయం ఎదుర్కొంటున్నారు. ఇంటర్మీడియేట్ తర్వాత రెండేళ్ల శిక్షణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉండడంతో డీఎడ్‌పై విద్యార్థులు ఆశలు పెంచుకున్నారు. వచ్చే యేడాది నుంచి డీఎస్సీకి సంబంధించి వరుస నోటిఫికేషన్లు ఉంటాయనే ప్రచారంతో విద్యార్థులు డీఎడ్‌పై ఆసక్తి చూపుతున్నారు. డీఎడ్‌లో చేరేందుకు వయో పరిమితి నిబంధన ఎత్తివేయడంతో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా డైట్‌సెట్‌కు హాజరయ్యారు.
మరోవైపు ప్రస్తుతమున్న నిబంధన సవరిస్తూ డైట్‌సెట్‌లో అర్హత సాధించిన వారినే యాజమాన్య కోటా కింద ప్రవేశం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే యేడాది నుంచి అమలవుతాయని చెబుతూ డైట్‌సెట్‌లో అర్హత సాధించని వారికి కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీంతో డీఎడ్ సీట్లకు మునుపెన్నడూ లేనంత స్థాయిలో పోటీ నెలకొంది.
యాజమాన్య కోటాకు గిరాకీ
జిల్లాలో ప్రభుత్వ డైట్ కాలేజీతో పాటు మొత్తం 33 డైట్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ డైట్ కాలేజీలో 150, ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 20శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకునే అవకాశం మేనేజ్‌మెంట్లకు కల్పించారు. దీంతో ఒక్కో కాలేజీకి సగటున 10 సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశముంది. డీఎడ్ సీట్లకు తీవ్ర పోటీ ఉండటంతో యాజమాన్యాలు సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నాయి.
కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడక మునుపే చాలా కాలేజీలో యాజమాన్య కోటా ముగిసినట్లు ప్రకటిస్తున్నాయి. ఒక్కో సీటుకు విద్యార్థుల నుంచి రూ.1.60లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు డిమాండు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టత లేకపోవడం, ఒకవేళ కౌన్సిలింగ్ నిర్వహించినా సీటు దక్కదనే భయంతో విద్యార్థులు యాజమాన్యాల బేరసారాలకు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్పష్టత ఇస్తేనే అభ్యర్థుల్లో అస్పష్టత తొలిగే అవకాశం ఉంది.