ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కెంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. కాగా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆశావహ నేతలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు టికెట్ల ఖరారు కోసం తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచనలో నిమగ్నం కాగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. పది స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సైతం అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ పంచాయితీ మంగళవారం ఢిల్లీకి చేరింది. బుధవారం ఓ మారు భేటీ అయినా... శుక్రవారం తేలే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ నుంచి మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్‌కు పిలుపు లేదు. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ డౌటే అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. వరంగల్, మహబూబాబాద్‌ల నుంచి అభ్యర్థులను బరిలో కి దింపనున్నట్లు పేర్కొన్న బీజేపీ సైతం 16వ తేదీ తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు జరిగినా.. అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే ఈ రెండు స్థానాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఇన్‌చార్జిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7న వరంగల్ ఓ సిటీ మైదానంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సన్నాహక సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గానే కసరత్తు చేస్తోంది. డీసీసీ, టీపీసీసీ నివేదికలను ఢిల్లీకి పంపగా.. ఢిల్లీలో సైతం స్క్రీనింగ్ కమిటీ బుధవారం పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. శుక్రవారం మరోమారు జరిగే మీటింగ్ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అభ్యర్థుల ప్రకటన 15 తర్వాతే..
అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీల్లో కసరత్తు సాగుతున్నా... ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అధికారికంగా 15వ తేదీ తర్వాతే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి æరోజు నుంచే అన్ని పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నా.. మరో రెండు, మూడు రోజులు వేచి చూడక తప్పేటట్లు లేదు. టిక్కెట్లపై టీఆర్‌ఎస్ నేతలు అధినేతపై భారం వేసుకోగా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. మహబూబాబాద్ ప్రస్తుత ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌కు ఈసారి టికెట్ రాదనే పార్టీ వర్గాలు చెప్తుండగా... వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అభ్యర్థిత్వంపై «అధినేత కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అక్కడ సీతారాంనాయక్‌ను మార్చితే మాజీ ఎమ్మెల్యే, రెడ్యానాయక్ కూతురు మాలోతు కవితకు టికెట్ ఖాయం అంటున్నారు.
కాంగ్రెస్ విషయానికి వస్తే వరంగల్ నుంచి 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నా... మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, ఇందిరలతో పాటు ఏడెనిమిది మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుంచి సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క, బలరాంనాయక్, బెల్లయ్య నాయక్ తదితరుల పేర్లపై కసరత్తు జరుగుతోంది. ఇదిలా వుంటే బీజేపీలో మాత్రం ఇప్పటికీ ఎన్నికల జోష్ కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సమాయత్తమవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. టికెట్ల కోసం దరఖాస్తులకే పరిమితమైన నేతలు ప్రచారం మాటెత్తడం లేదు. వరంగల్ నుంచి పరకాల మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, చింతా సాంబమూర్తి, సినీనటుడు బాబూమోహన్ పేర్లు వినిపిస్తుండగా, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, యాప సీతయ్య, సినీ నటి రేష్మా రాథోడ్ తదితరులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment