సాక్షి, సంస్థాన్ నారాయణపురం : ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
మండలానికి ఒక ప్రచార వాహనం ఏర్పాటు చేసి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ పాటల ద్వారా ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ రోజు తమ కార్యకర్తలను వెంట తెచ్చుకొని బలనిరూపణ చేసుకున్నారు. మునుగోడుకు సాగు జలాలే ప్రధాన అజెండాగా అన్నిపార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో ముందున్న టీఆర్‌ఎస్
ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడంతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరో దఫా నియోజకవర్గంలో ప్రతిరోజు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి, ప్రత్యర్థుల లోపాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్ హయాంలో ఏవిధంగా అభివృద్ధి చేశారో చెబుతున్నారు.
బీజేపీ అభ్యర్థి ప్రచారం ఇలా..
బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి బీజేపీ జాతీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామితో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. మండలం వారీగా ప్రణాళిక రూపొందించుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే ఏవిధంగా అభివృద్ధి చేస్తానో చూపిస్తాను అంటూ అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి దూకుడు..
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వం ప్రకటించడం ఆలస్యమైనప్పటికీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చాలా రోజులుగా చాపకింద నీరులా తమ కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారిలో జోష్ నింపారు.
మిత్రపక్షాలైన సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి మిత్రధర్మం పాటిస్తామని హామీ ఇచ్చి ప్రచారానికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వివిధ పార్టీల అసంతృప్త నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రోడ్డుషోలతో పాటు, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
బీఎల్‌ఎఫ్, ఇతరుల ప్రచారం..
బీఎల్‌ఎఫ్ అభ్యర్థి కరుణాకర్ నియోజకవర్గంలో ఆలస్యంగా ప్రచారం మొదలు పెట్టారు. వీరు కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో అన్నిపార్టీల అభ్యర్థులతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment