
15 వేల కోట్లివ్వండి.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా
ప్రభుత్వానికి నాగం సవాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరందేలా చేసి చూపిస్తానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మం త్రి నాగం జనార్దన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం నాగం నేతృత్వం లోని బీజేపీ బృందం పలువురు రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను సందర్శించింది.
అనంతరం కరీంనగర్‌లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి యెన్నం శ్రీని వాస్, జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు తదితరుల తో కలిసి నాగం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 34 భారీ, 17 మధ్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేస్తే 46 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు.