ఇక్కడి సంస్థలన్నీ మావే: తెలంగాణ సర్కారు
పదో షెడ్యూలు సంస్థలపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
* అన్ని సంస్థల్లో నియామకాలు మావే
* వాటి నిధులూ తమవేనని బ్యాంకులకు లేఖలు
* ఏపీ ప్రభుత్వ కవ్వింపు చర్యలపై తెలంగాణ సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో ఉన్న సంస్థలపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ భౌగోళికంగా తమ ప్రాంతంలోనే ఉన్నందున..
తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తేల్చేసింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న 142 సంస్థలు భౌగోళికంగా తమ ప్రాంతంలోనే ఉన్నాయని... ఇవన్నీ తమకే చెల్లుతాయని పునరుద్ఘాటించింది. వీటికి సంబంధించిన ఆస్తులు, నిధులన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తెలిపింది. ఒకవేళ ఈ సంస్థల సేవలు కావాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటే.. తగిన చార్జీలు చెల్లించి వాడుకోవాలని సూచించింది. వీటికి సంబంధించిన నిధులు, నియామకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయా సంస్థల్లో ఏపీకి చెందిన వారుంటే పంపించి.. తెలంగాణ వారిని నియమించుకోవాలని సూచించారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్లు.. తదితర చట్టబద్ధ సంస్థల పదవులకు సైతం వెంటనే నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు ఏపీ ప్రభుత్వం పోటీగా మరో ఐఏఎస్ అధికారిని డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదో షెడ్యూలులోని సంస్థలపై వివాదం మళ్లీ మొదలైంది. ఏపీ సర్కారు చర్య కయ్యానికి కాలు దువ్వినట్లుగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులు, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో గురువారం ఆకస్మికంగా సమావేశం ఏర్పాటు చేశారు. పదో షెడ్యూలులో విభజన జరగని సంస్థలకు సంబంధించిన నియామకాలు, నిధులపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు అయిదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి సూచనలు, సలహాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఏపీ ఉన్నత విద్యామండలి తెలంగాణ భూభాగంలో ఉన్నందున దాని బ్యాంకు ఖాతాలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలికి అధికారం ఉంటుంది...’ అని ఇటీవలే ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎస్ గుర్తు చేశారు.
ఈ తీర్పు ఆధారంగా పదో షెడ్యూలులోని కార్పొరేషన్లు, సంస్థల నిధులు, సేవల విభజనను వెంటనే చేపట్టాలని సూచించారు. ఏపీఎస్ ఆర్‌టీసీతో పాటు ఎంసీహెచ్‌ఆర్‌డీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏపీ స్టడీ సర్కిల్, పోలీస్ అకాడమీ, అపార్డ్, అప్‌కాస్ట్, ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్, ఏపీ లైవ్‌స్టాక్ అకాడమీ, ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ లాంటి విభాగాలు పదో షెడ్యూలులో ఉన్నాయి. ఉన్నత విద్యా మండలిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు... నిధుల విషయంలో తదుపరి చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. వెంటనే అన్ని సంస్థలకు సంబంధించిన ఖాతాల్లోని నిధులు తమకే చెందుతాయని, వాటిని వినియోగించకుండా స్తంభింపజేయాలని అన్ని బ్యాంకులకు లేఖలు రాయాలని నిర్ణయించారు.