పనులన్నీ టీచర్లకే... | all works to teachers | Sakshi
Sakshi News home page

పనులన్నీ టీచర్లకే...

Published Sun, May 24 2015 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

all works to teachers

బోధనకు ఆటంకంగా బోధనేతర పనులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలొస్తే వారే కావాలి.. సర్వేలూ వారే చేయాలి.. శిక్షణలకు హాజరుకావాలి.. మధ్యాహ్న భోజనం నుంచి విద్యార్థుల హాజరుదాకా లెక్కలు రాయాలి.. అనధికారిక పనుల నుంచి అధికారిక విధుల వరకూ అన్నీ చేయాలి.. నివేదికల మీద నివేదికలు రూపొందించాలి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. పాఠశాలలు ప్రారంభమైంది మొదలు వారికి సవాలక్ష పనులు, బోధనేతర కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు..

ఇలా ఇన్ని ఒత్తిళ్ల మధ్య, గుక్కతిప్పుకోలేని పరిస్థితిలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బోధనేతర కార్యక్రమాలతో ఏటా 35 నుంచి 45 రోజుల వరకు వృథా అవుతున్నా సిల బస్‌ను పూర్తిచేస్తూ.. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లకు వేరే బాదరబందీలేమీ ఉండవు. ఉదయం బడికి వెళ్లారంటే విద్యాబోధనపైనే దృష్టి. అయినా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫలి తాలను సాధిస్తున్నారు.

అదే ప్రభుత్వ టీచర్లకు బోధనేతర పనులు అప్పగించకుండా ఉంటే.. మరింత అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయ సం ఘాలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ పాఠశాలలపై పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచవచ్చని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకుని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తే సర్కారీ విద్యను ఎదురులేని వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 
ప్రభుత్వ టీచర్లకు తప్పని తిప్పలివి..
పాఠశాల సంసిద్ధత కార్యక్రమం.
చదువుల పండుగ పేరిట వారం నుంచి 15 రోజుల వరకు కార్యక్రమాల నిర్వహణ, నివేదికల రూపకల్పన.
ఏటా గ్రామంలో బడి ఈడు పిల్లలు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది స్కూళ్లలో ఉన్నారు, డ్రాపవుట్స్ ఎంత, నమోదు కాని విద్యార్థులు ఎంత మంది అనే వివరాలు సేకరించడం. వెబ్‌పోర్టల్ నివేదికలు పొందుపరచడం. గ్రాంట్స్ ఎన్ని వచ్చాయి, ఎంత వాడుకున్నారు, ఎంత మిగిలిందనే వాటిపై నివేదికల రూపకల్పన.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల వారీగా విద్యార్థులు రోజు ఎంత మంది పాఠశాలకు వస్తున్నారు, ఎంత మంది మధ్యాహ్న భోజనం చేశారు, వినియోగించిన బియ్యమెంత, ఖర్చయిందెంత? వంటి వివరాలపై రోజువారీ నివేదికలు రూపొందించడం. వాటితోపాటు బియ్యం నిల్వలపై నివేదికల రూపకల్పన, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం. వీటిపై మళ్లీ 15 రోజులకోసారి, నెలకోసారి నివేదికలు అందజేయడం.
ఇక ఫిజికల్ డెరైక్టర్లు, పీఈటీలు లేని పాఠశాలల్లో పిల్లలతో డ్రిల్ పీరియడ్‌లో ఆటలు ఆడిపించడం టీచర్ల బాధ్యతే.
⇒  75 శాతం స్కూళ్లలో క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు లేనందున జీతాల బిల్లులు, నివేదికల రూపకల్పన  పనులు టీచర్లే నిర్వహిస్తున్నారు. ఏటా ఆగస్టు వచ్చిందంటే పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పనులు వారికే.
జిల్లా స్థాయిలో కంప్యూటర్లు పెట్టి 10 నుంచి 20 మంది సబ్జెక్టు టీచర్లతోనే డీఈవో కార్యాలయాల్లో నెలల తరబడి అనధికారిక పనులు చేయిస్తుంటారు. కౌమార విద్యపై వారం పదిరోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు.
సబ్జెక్టు రిసోర్స్ పర్సన్ల పేరుతో ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. వారు ఆ తరువాత కొన్ని మండలాల్లో శిక్షణలు ఇస్తారు. దీనికే ఏటా 20 రోజుల సమయం పోతోంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకు 15 మంది వరకు శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా ఇంగ్లిషు బోధనపై 15 నుంచి 25 రోజుల శిక్షణ. ఇలాంటి శిక్షణలన్నీ పాఠశాలలు కొనసాగే రోజుల్లోనే ఉంటాయి.
పరీక్షలకు ముందు ఎస్సెస్సీ పరీక్ష పేపర్లను జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్లకు, మండలాల పీఎస్‌లకు పంపించేందుకు రూట్ ఆఫీసర్, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ విధులు. పరీక్షలకు ముందు 20 రోజుల పాటు బార్ కోడింగ్ ఆఫీసర్ విధులకు వెళ్లడం.
⇒ 13 రోజుల పాటు ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలు.
⇒  వీటన్నింటికీ అదనంగా ఎన్నికల విధులు, సర్వేలు, ఓటర్ల జాబితా సవరణ పనులు.. వీటికి ముందుగా శిక్షణలు
 
బోధనేతర పనులతో ఒత్తిడి
టీచర్లకు బోధనేతర పనులను అప్పగించవద్దు. అలాంటివాటితో సమయం వృథా అవుతోంది. ఆ ఒత్తిడిలో పనిచేస్తూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అదే బోధనేతర పనులను తొలగిస్తే మరింత బాగా పని చేయగలుగుతారు. అద్భుత ఫలితాలు వస్తాయి.
- వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు
 
నివేదికలు తగ్గించాలి
టీచర్లకు నివేదికలు రూపొందించడం వంటి పనులను అప్పగించడాన్ని తగ్గించాలి. వాటికే ఎక్కువ సమయం పోతోంది. తద్వారా బోధనలో సమస్యలు తలెత్తుతున్నాయి. బోధనేతర పనులను తగ్గిస్తే మరింత బాగా పనిచేస్తారు. మంచి ఫలితాలు వస్తాయి..
 - నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు
 
సెలవుల్లోనే శిక్షణ ఇవ్వాలి
ఉపాధ్యాయులకు సెలవు రోజుల్లో మాత్రమే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. దానివల్ల బోధనకు ఆటంకం ఉండదు. పిల్లలకు నాణ్యమైన విద్య లభించాలంటే ఇదే మార్గం. లేకపోతే బోధనలో ఇబ్బందులు తప్పవు..
- అబ్దుల్లా, పండిత పరిషత్ అధ్యక్షుడు
 

బోధనేతర పనులొద్దు..
ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు రూపొందించడం, కంప్యూటరీకరించడం వంటి పనులకు వారిని వినియోగించొద్దు. పాఠశాల  సమయంలో వారికి ఎలాంటి శిక్షణలు ఇవ్వొద్దు.
- కొండల్‌రెడ్డి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు
 
‘ఇంటర్’ విధులకే 15 రోజులు
పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలకు చాలా సమయం వృథా అవుతోంది. వీటికి అదనంగా ఇంటర్ పరీక్షల ఇన్విజిలే షన్ విధులకు 15 రోజుల సమయం పోతోంది. ఇంకా రకరకాల సర్వేలు, నివేదికల పేరుతో బోధనకు అవాంతరం కలుగుతోంది. వాటిన్నింటిని తగ్గించాలి.’’
 - హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్షుడు
 
బడిలో ఉంటేనే నమ్మకం
టీచర్లు బడిలో ఉండి, రోజూ పాఠాలు చెబితేనే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది. శిక్షణలు, ఇతర పనుల పేరుతో బోధనకు దూరంగా ఉంచితే టీచర్లపై సదభిప్రాయం పోతోంది. ప్రభుత్వ విధానాలను సవరించాలి. అప్పుడే టీచర్లపై తల్లిదండ్రుల్లో మంచి అభిప్రాయం వస్తుంది.’’
- రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement