జీతాలు, సదుపాయాలను బట్టే స్కూల్ ఫీజులు!
► వాటి ప్రాతిపదికగానే ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నిర్ణయించనున్న ప్రభుత్వం
► నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే గుర్తింపు రద్దు
►ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడేళ్లపాటు అమలు
► ఫీజులో 50 శాతం వేతనాలు, మరో 15 శాతం టీచర్ల సంక్షేమానికే...
► సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలోనూ ఫీజులను నిర్ణయించనున్న సర్కారు
► ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ విధానం ఖరారు.. జనవరిలో ఉత్తర్వులు
►జూన్ లోగా పాఠశాలలవారీగా ఖరారు కానున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11,470 ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజుల విధానం దాదాపు ఖరారైంది. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ, నిర్ణయానికి విద్యాశాఖ చేపట్టిన కసరత్తు పూర్తయింది. ఫీజుల విధానంపై జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కానున్నాయి. జూన్ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరపు ఫీజులను ప్రభుత్వం అంతకంటే ముందుగానే ఖరారు చేయనుంది. ఈ మేరకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ, ప్రభుత్వం దృష్టి సారించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వృత్తివిద్యా కాలేజీల తరహాలోనే పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కిందటి సంవత్సరంలో పాఠశాల యాజమాన్యం టీచర్లు, సిబ్బందికి చెల్లించిన వేతనాలు, టీచర్ల సంక్షేమం, సదుపాయాలు, నిర్వహణకు వెచ్చించిన ఖర్చుల ప్రాతిపదికగా స్కూల్ ఫీజులను నిర్ణయించ నుంది. దీంతో చాలా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించే ఫీజులో 50 శాతాన్ని టీచర్ల వేతనాలకే వెచ్చించాలన్న నిబంధనను అమల్లోకి తేనుంది. మరో 15 శాతం నిధులను ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర టీచర్ల సంక్షేమం కోసం వెచ్చించేలా నిబంధనల్లో పొందుపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌తోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌తో కొనసాగే ప్రైవేటు పాఠశాలల్లోనూ వసూలు చేసే ఫీజులను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించనుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సూచించిన కనీస, గరిష్ట ఫీజుల విధానానికి విద్యాశాఖ ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి పైసా వసూలు చేసినా ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయనుంది. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడేళ్లపాటు అమల్లో ఉండేలా విధానం రూపొందించింది.
ఫీజులను ఎలా నిర్ణయిస్తారంటే..
పాఠశాల యాజమాన్యం ఆమోదంతో కరస్పాం డెంట్/సెక్రటరీ పాఠశాలల ఆదాయ (వసూలు చేసిన ఫీజు), వ్యయాలకు సంబంధించిన (టీచర్ల వేతనాలు, సదుపాయాలు, టీచర్ల సంక్షేమం, నిర్వహణ ఖర్చులు) ఆధారాలతో తమ పాఠశాలల్లో వసూలు చేసే ఫీజులను తరగతులవారీగా జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీకి (డీఎఫ్‌ఆర్‌సీ) ఆన్ లైన్ లో ప్రతిపాదించాలి. వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్, ఆడిట్/పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, సభ్య కన్వీనర్‌గా డీఈవో ఉండే డీఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలిస్తుంది. వసూలు చేసిన ఫీజులు, అయిన ఖర్చుల్లో తేడాలున్నా, యాజ మాన్యం ప్రతిపాదనల్లో లోపాలున్నా డీఎఫ్‌ఆర్‌సీ ఆయా యాజమాన్యాలతో చర్చించి, తమ సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుంది. అన్ని జిల్లాల్లోని డీఎఫ్‌ఆర్‌సీల నుంచి పాఠశాలలవారీగా వచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి తుది ఫీజును ఖరారు చేయనుంది. ఆ ఫీజునే పాఠశాలలు వసూలు చేయాల్సి ఉంటుంది.
ఫీజు నిబంధనల్లోని ప్రధానాంశాలు...
♦ ఏ రకమైన పేరుతోనూ పాఠశాల యాజమాన్యం డొనేషన్ వసూలు చేయరాదు.
♦ వన్ టైమ్ కింద దరఖాస్తు ఫీజు 100 లోపు ఉండాలి.
♦ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 లోపే ఉండాలి.
♦ తిరిగి చెల్లించే (రిఫండబుల్) విధానంలో రూ. 5 వేలలోపే కాషన్ డిపాజిట్ ఉండాలి. ఆ మొత్తాన్నీ పాఠశాల యాజమాన్యం డీఎఫ్‌ఆర్‌సీకి సమర్పించాలి. ఇవి మినహా మరే పేరుతోనూ వన్ టైమ్ ఫీజు వసూలు చేయొద్దు.
♦ టీచర్లు, సిబ్బంది వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణ ఖర్చులు, వసతులు, సదుపాయాలు, స్పెషల్ ఫీజులను పరిగణనలోకి తీసుకొని ట్యూషన్ ఫీజు నిర్ణయిస్తారు. ఈ మొత్తాన్ని కనీసంగా మూడు విడతల్లో వసూలు చేయాలి.
♦ రెగ్యులర్ సిలబస్‌తో సంబంధం లేకుండా ఇతరాల పేరుతో వసూలు చేసే ఫీజులను ట్యూషన్ ఫీజు ఖరారులో పరిగణనలోకి తీసుకోరాదు. అది తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలేయాలి. సిల బస్‌తో సంబంధం లేకుండా వసూలు చేసే వాటికి వేరే అకౌంట్ నిర్వహించాలి.
♦ పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లకు మూడు షాపుల పేర్లను సూచించాలి.
♦ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ, యూనిఫారాల కౌంటర్లు ఉండకూడదు.
♦ ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దవుతుంది.
♦ ఒక విద్యా సంవత్సరంలో వసూలు చేసే ఫీజుల నిర్ణయం కోసం అంతకు ముందు విద్యా సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరులోగా యాజమాన్యాలు ప్రతిపాదనలు అందజేయాలి. ఆ ప్రతిపాదనలను డీఎఫ్‌ఆర్‌సీలు 60 రోజుల్లో పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి. ప్రభుత్వం జనవరి కల్లా వాటిని ఖరారు చేస్తుంది.
♦ మార్చి 21 నుంచి ఆపై విద్యా సంవత్సరపు తరగతులు ప్రారంభమవుతాయి. ఒకవేళ జూన్ నాటికి ఫీజులు ఖరారు కాకపోతే కిందటి విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులనే అమలుచేయాలి.