ఉత్సాహంగా వచ్చాను | Am looking forward to | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వచ్చాను

Published Sat, Jan 17 2015 4:02 AM | Last Updated on Mon, Aug 13 2018 3:20 PM

ఉత్సాహంగా వచ్చాను - Sakshi

ఉత్సాహంగా వచ్చాను

ప్రశాంతమైన జిల్లా. ప్రగతి పథంలో ఉన్న ప్రాంతం. అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్న జిల్లా కరీంనగర్. చాలా ఉత్సాహంతోనే ఇక్కడికి వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘ప్రశాంతమైన జిల్లా. ప్రగతి పథంలో ఉన్న ప్రాంతం. అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్న జిల్లా కరీంనగర్. చాలా ఉత్సాహంతోనే ఇక్కడికి వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా’ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీతుకుమారి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలివి. కలెక్టరేట్  ఆడిటోరియంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం రాత్రి మాజీ కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కమిషనర్ శ్రీకేష్ లట్కర్‌లకు ఆత్మీయ వీడ్కోలుతోపాటు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

నీతుకుమారి ప్రసాద్ మాట్లాడుతూ ‘కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రెండో జిల్లా ఇది. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం. వీరబ్రహ్మయ్యగారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఆసక్తిగా ఉన్నాయి. తప్పకుండా పాటిస్తా. విద్య, వైద్య రంగాలు నా ప్రాధాన్యత’ అని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రశాంతమైన , అత్యధిక వృద్ధి రేటున్న జిల్లా అని తనకు సమాచారముందని, అందుకే ఉత్సాహంగా ఇక్కడికి వచ్చానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతలు చాలా ఉన్నాయని, అధికారుల సహకారంతో ఆయా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తానని ఉద్ఘాటించారు.
 
జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. ఉద్యోగులందరితో కలిసి జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానని ఆకాంక్షించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సమయం కంటే అదనంగా మరో రెండు గంటలు పనిచేస్తామని జిల్లా తహశీల్దార్ల సంఘం నాయకుడు పద్మయ్య చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ... అధికారులందరి సహకారంతో ప్రభుత్వ ప్రాధాన్యతలను పూర్తి చేస్తానని చెప్పారు. అనంతరం బదిలీపై వెళుతున్న వీరబ్రహ్మయ్య, సర్పరాజ్ అహ్మద్, శ్రీకేష్ లట్కర్‌ను అధికారులు ఘనంగా సన్మానించారు.
 
శభాష్ అన్పించుకుని వెళుతున్నా :
వీరబ్రహ్మయ్య ఏడాదిన్నర కాలంలో కలెక్టర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా నియమితులైన వీరబ్రహ్మయ్య అన్నారు. తన హయంలో స్థానిక సంస్థల, సాధారణ, మున్సిపల్ ఎన్నికలు ఏకకాలంలో రావడం, సమర్థవంతంగా ప్రక్రియ ముగించడం మరిచిపోలేనన్నారు. అటెండర్ నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జాయింట్ కలెక్టర్ వరకు శ్రమించి జిల్లాకు మంచి పేరు తెచ్చారని అన్నారు. ఎక్కడలేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోనే 3 లక్షల 70 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, పది లక్షల మందికి ఆహారభద్రత కార్డులు గుర్తించడం జరిగిందని, జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లలో ముందుందని అన్నారు.

రాబోయే సమస్యలివే...!
జిల్లాలో రాబోయే కాలంలో కరవు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయని వీరబ్రహయ్య చెప్పారు. వీటిని అధిగమించేందుకు ఉపాధిహామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ పథకం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, గ్రామ సందర్శన కార్యక్రమం అనుకున్న విధంగా ముందుకు పోలేదని చెప్పిన వీరబ్రహ్మయ్య విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత 64 శాతం మాత్రమే ఉండడం బాధాకరమని, దీన్ని 85 శాతానికి పెంచాలన్నారు. ప్రతీ నాలుగు కాన్పుల్లో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరగడం బాధాకరమన్నారు.
 
లక్ష్యాన్ని సాధించాం: సర్ఫరాజ్ అహ్మద్

అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేశామని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సూచనలు, సలహాలు , ఉద్యోగుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, సీఈవో అంబయ్య, మంథని ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగదీశ్వర్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.


టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లను సమ్మక్క-సారక్కలుగా పోల్చుతూ జిల్లా అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
 
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
కరీంనగర్: శుక్రవారం సాయంత్రం 6.45 గంట లకు కలెక్టరేట్‌కు చేరుకున్న నీతూకుమారి ప్రసాద్ 6.50కి తన చాంబర్‌కు వచ్చారు. 6.53గంటలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ముందుగా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, ప్రజా ఫిర్యాదుల విభాగం సెల్, కలెక్టరేట్‌లోని ప్రధాన ఫోర్టికో కారిడార్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

కలెక్టరేట్‌లోని వరండాలో లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏఓ కార్యాలయంలో పేరుకుపోయిన ఫైళ్లను చూపిస్తూ ఇవేమిటనిప్రశ్నించారు. గోడలకు ఉన్న వాల్‌పోస్టర్లను తొలగించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం 7.30 గంటలకు క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, డ్వామా పీడీ గణేష్, జెడ్పీ సీఈఓ అంబయ్య, డీఎస్‌వో చంద్రప్రకాశ్, ఏఓ రాజాగౌడ్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement