
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ నుంచి ఈ నెల 17న అంబేడ్కర్ సమతా యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్‌ఎస్‌వీ, దళిత బహుజన విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 డిసెంబర్ 18న అప్పటి రాష్ట్రపతి నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షా భూమి వద్ద బౌద్ధ స్తూపాన్ని ఆవిష్కరించారని, అప్పట్నుంచి ఆ తేదీన దీక్ష భూమికి వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 17న జింఖానా గ్రౌండ్స్ నుంచి 1,000 వాహనాల్లో దీక్షా భూమికి పయనమవుతారని, దళిత, బహుజన యువతీ యువకులు, విద్యార్థులు, మేధావులు ఇందులో పాల్గొంటారన్నారు. ఈ నెల 18న వీరంతా దీక్షా భూమిని సందర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారన్నారు. ఈ సందర్భంగా సమతా యాత్ర వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆవుల బాలనాథం, మాల జన సమితి అధ్యక్ష, కార్యదర్శులు మాందాల భాస్కర్, గడ్డం శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment