గదిలో నిర్బంధించి.. తీవ్రంగా కొట్టి.. | police complaint On MD SuchirIndia Infratech Limited | Sakshi
Sakshi News home page

గదిలో నిర్బంధించి.. తీవ్రంగా కొట్టి..

Published Wed, Mar 19 2025 7:45 AM | Last Updated on Wed, Mar 19 2025 7:45 AM

police complaint On MD SuchirIndia Infratech Limited

సుచిరిండియా ఎండీ కిరణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు  

హైదరాబాద్: లెక్కల్లో తేడా వచ్చిందని తమ సంస్థ ఉద్యోగిని గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టి హింసించాడనే ఆరోపణలపై సుచిరిండియా ఇన్‌ఫ్రా టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ లయన్‌ కిరణ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..వరంగల్‌కు చెందిన బుస్సా ప్రియాంక్‌ సుచిరిండియాలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న సంస్థ జీఎం మధుసూదన్‌ అతడికి ఫోన్‌ చేసి కిరణ్‌ను కలవాలని చెప్పాడు. దీంతో ప్రియాంక్‌  బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–3లో ఉన్న లయన్‌ కిరణ్‌ ఇంటికి వచ్చాడు. 

అప్పటికే ఆగ్రహంగా ఉన్న కిరణ్‌ రూ.5 లక్షలు మోసం చేశావంటూ ప్రియాంక్‌పై దాడి చేయడమేగాక గదిలో నిర్భందించాడు. దీంతో అతను తనను కొడుతున్నారంటూ తన బంధువు ప్రమోద్‌కుమార్‌కు సమాచారం అందించడంతో ప్రమోద్‌ డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రియాంక్‌ను స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

తనపై దాడి చేయడమే కాకుండా ఈ విషయం పోలీసులకు చెప్పినా తనను ఏమీ చేయలేరంటూ కిరణ్‌ బెదిరించాడని, బలవంతంగా పోన్‌ పే ద్వారా కొంత డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మీడియా, పోలీసులను తప్పుదోవ పట్టించాడు 
తప్పుడు సమాచారంతో మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించిన తమ మాజీ ఉద్యోగి ప్రియాంక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుచిరిండియా సంస్థ అధినేత లయన్‌ కిరణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  తన సంస్థ వరంగల్‌ రిసార్ట్‌లో పని చేసే మాజీ ఉద్యోగి ప్రియాంక్‌ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి బంజారాహిల్స్‌లోని తన ఇంటికి పిలిపించామన్నారు.  

అదే రిసార్ట్‌లో ఆపరేషనల్‌ హెడ్‌ పని చేసే అధికారిని ఈ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పామని అప్పటి వరకు తన ఇంట్లో ముందున్న ఆఫీస్‌ వద్ద ఉండమని చెప్పామన్నారు. అతను వస్తే తన బండారం బయటపడుతుందనే భయంతో బయటికి వెళ్లిన ప్రియాంక్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని అక్కడితో ఆగకుండా తనను కిడ్నాప్‌ చేశామని, కొట్టామని మీడియాతో చెప్పాడన్నారు.అతను స్వయంగా  రూ. 5 లక్షల ఫ్రాడ్‌ జరిగిందని అందరికీ చెబుతున్నాడని ఈ వ్యవహారంపై తాము   పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement