
అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ మెట్రో స్టేషన్‌లో ఇంజినీర్లు, నిపుణులతో ఎల్‌అండ్‌టీ ఎండీ శివానంద నింబార్గీ, అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రెండు మెట్రో కారిడార్లు కలిసే అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ మెట్రో స్టేషన్ దేశంలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటిగా ఖ్యాతి గడించిందని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సోమవారం ప్రకటించింది. నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీ నగర్–మియాపూర్ కారిడార్లు కలిసేచోట ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 28న మెట్రో ముహూర్తం కుదిరిన నేపథ్యంలో స్టేషన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇందులో ప్రతీది ఒక విశేషంగా భావిస్తున్నారు. ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌లోకి మారేందుకు ఈ స్టేషన్‌లో దిగిన ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులను ఇక్కడ కల్పించారు.
ప్రత్యేకతలివే...
⇒ సూమారు 2 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో స్టేషన్ ఏర్పాటు.
⇒ ప్రతి రోజూ 40 వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా.
⇒ 142 మీటర్ల పొడవు..40 మీటర్ల వెడల్పులో ఈ స్టేషన్ ఉంది. ఇందులో రిటెయిల్ దుకాణాలు, ప్రయాణికులకు వినోదం పంచే వసతులు, ఇతర స్టోర్లను ఏర్పాటు చేస్తారు.
⇒ ప్రయాణికులు ఒక మార్గం నుంచి మరొక మార్గానికి మారేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తని రీతిలో స్టేషన్‌ను నిర్మించారు.
⇒ స్టేషన్ మధ్యభాగానికి(కాన్‌కోర్స్‌లెవల్‌కు) చేరుకోవడానికి ఎలాంటి టిక్కెట్ అవసరంలేదు. ఇక్కడ ఏటీఎం కేంద్రాలు కూడా ఉంటాయి.
⇒ ప్రధాన రహదారిపైన 30 మీటర్ల ఎత్తున..రూఫ్‌లెవల్ 36 మీటర్ల ఎత్తున ఏర్పాటుచేశారు.
⇒ ఈ స్టేషన్ పైకప్పును టెట్రాహైడ్రాన్ స్టీల్‌కాలమ్స్‌తో చూడముచ్చటగా నిర్మించారు.
⇒ స్టేషన్‌పైకి చేరుకునేందుకు ప్రధాన రహదారికి ఇరువైపులా మెట్లు, 16 ఎస్కలేటర్లు, 8 లిఫ్టులు ఏర్పాటుచేశారు.
⇒ స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ టిక్కెట్ జారీ యంత్రాలు, గేట్లు, టికెటింగ్ రూమ్‌లు ఉన్నాయి.
⇒ స్టేషన్‌లో బ్రౌన్‌గ్రానైట్ ఫ్లోరింగ్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.
⇒ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా లక్ష లీటర్ల నీటిని నిల్వచేసే భారీ సంపును నిర్మించారు.
⇒ స్టేషన్ పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేలగర్భంలోకి చేరవేసేందుకు భారీ ఇంకుడు గుంతలు తవ్వారు.
⇒ తక్కువ ఇంధన వినియోగంతో నడిచే ఎయిర్‌కండీషన్ వ్యవస్థ ఏర్పాటుచేశారు.
⇒ సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఏర్పాట్లున్నాయి.
⇒ ఆటోమేటిక్ ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థ, క్లీన్‌గ్యాస్ ఏర్పాట్లున్నాయి.
⇒ ఒకే దారి నుంచి ఆరువేల మంది చొప్పున లోనికి, బయటికి వెళ్లొచ్చు.
⇒ కారిడార్ మారే వారికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాచారం చేరవేసేందుకు అనౌన్స్‌మెంట్ సిస్టం ఉంది.
⇒ 33 కె.వి పవర్‌బ్యాకప్, 400 కిలోవాట్ల డీజిల్ జనరేటర్, యూపీఎస్ పవర్‌సప్లై వ్యవస్థలున్నాయి.
⇒ ఉప్పల్ మెట్రో డిపోలోని ఓసీసీ కేంద్రం నుంచి ఈ స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
⇒ ఈ స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు రైలును నిలపనున్నారు. మిగతా స్టేషన్లలో కేవలం 20 సెకన్లపాటు మాత్రమే నిలుపుతారు.