రేపటి నుంచి ఓటరు జాబితా సవరణ | Amendment the voter list from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఓటరు జాబితా సవరణ

Published Thu, Sep 25 2014 3:36 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

రేపటి నుంచి ఓటరు జాబితా సవరణ - Sakshi

రేపటి నుంచి ఓటరు జాబితా సవరణ

నీలగిరి : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వతేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతను ఓటరుగా నమోదు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతారు.ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 26 నుంచి అక్టోబర్ 10వరకు జిల్లాలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేసే ప్రక్రియ చేపడతారు. బూత్ స్థాయి అధికారులు ‘ఇంటింటికీ వెళ్లి ఓటర్లు తనిఖీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
 
 ఈ తనిఖీలో అధికారులు ఓటర్ల జాబితా సవరణ, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓటరు కార్డుల తొలగింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలు నమోదు చేస్తారు. ఇంటింటి సర్వేతో పాటు యజమాని సంతకం కూడా తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు అవకాశం కల్పించారు. వారు బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. ప్రతి బూత్ స్థాయి అధికారి కోసం ఆ పరిధిలోగల ఓటర్ల వివరాలతో రిజిష్టర్లు తయారు చేశారు. ఈ రిజిష్టర్లతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తారు. వాటిలో ఏమైనా తప్పులుంటే ఆ అధికారికి తెలియజేసి, వాటిని సరిచేయడానికి అవసరమైన పత్రాలను (గుర్తింపు కార్డు) సమర్పించాలి.
 
 జిల్లాలో మొత్తం ఓటర్లు    25,41,520
 పురుషులు    12,75,267
 మహిళలు    12,66,253
 ఓటరుగా నమోదుకు
 వచ్చిన దరఖాస్తులు    11,352
 బోగస్ ఓటర్లు    21,948
 
 15రోజుల్లో తనిఖీలు పూర్తి
 ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేసే కార్యక్రమాన్ని శుక్రవా రం నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు అంటే 15 రోజు ల్లో పూర్తి చేస్తారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తారు. మార్పులు చేసిన ముసాయిదా జాబితాను నవంబర్ నెలాఖరున ప్రకటిస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం కోసం డిసెంబర్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఓటరు నమోదు చేసుకునేందుకు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 2015 జనవరి 25న ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు. తదనంతరం ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో ప్రవేశపెడతారు.
 
 బోగస్ ఓటర్ల తొలగింపు
 అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 21,948 మంది బోగస్ ఓటర్లు ఉన్నారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించి ఈ ఓటర్లను తొలగిస్తారు. వీరిలో వలస వెళ్లిన వారు, డబుల్ ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారు ఉన్నారు. అదే విధంగా నిరంతర ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 10 తేదీ నుంచి ఈ నెల 20 వరకు కొత్తగా 11,352 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. బోగస్ ఓటర్లను తొలగించడంతో పాటు, కొత్త ఓటర్ల దరఖాస్తులను కూడా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ నెలాఖరు నాటికి ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement