నల్లగొండ జిల్లా పెద్దదేవులపల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న జనం
బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా చరిత్రాత్మకం: అమిత్ షా
నల్లగొండ టూటౌన్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం చరిత్రాత్మకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్‌లో బీసీ సంఘాల ప్రతినిధులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయని గొప్ప పనిని బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తే రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. బీసీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని, తెలంగాణలో తమను ఆదరించాలని కోరారు.
ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం: దత్తాత్రేయ
2019 ఎన్నికల్లో అన్ని కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాతో రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.
బీజేపీకి మద్దతుకు బీసీలు సిద్ధం: ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీకి మద్దతు తెలపడానికి బీసీలందరూ సిద్ధంగా ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కమిషన్‌కు మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించడం అభినందనీయమన్నారు.
బీసీలను ఓటర్లుగానే చూశారు: లక్ష్మణ్
గత 50 ఏళ్ల నుంచి దేశంలో అన్ని పార్టీలూ బీసీలను ఓటర్లుగానే చూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల హక్కులను కాపాడేందుకు, వారి సంక్షేమా నికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు అమిత్‌షాను గజమాలలతో సన్మానించారు. ఇందులో ఎంపీ భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ నేత లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.