
ఎంఐఎం ముందు మోకరిల్లిన టీఆర్‌ఎస్ : అమిత్ షా
నారాయణపేట : తెలంగాణలో త్రిముఖ పోరు సాగుతోందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎంఐఎం దగ్గర ఆత్మాభిమానం తాకట్టుపెట్టిన టీఆర్‌ఎస్, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న సిద్ధూ ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, మోదీ సారథ్యంలో దేశభక్తులతో కూడిన బీజేపీల మధ్య పోరాటం జరుగుతోందని అభివర్ణించారు.
కేసీఆర్ తన కుటుంబసభ్యుల కోసం ముందస్తుకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం ముందు నిలువలేమనే భయంతో ముందస్తుకు కేసీఆర్ మొగ్గుచూపారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఆదివారం బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నారాయణపేట అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.