సర్టిఫికెట్లు అమ్ముకుంటారా? | AN Roy takes on universities | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్లు అమ్ముకుంటారా?

Published Sun, Nov 30 2014 2:56 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

సర్టిఫికెట్లు అమ్ముకుంటారా? - Sakshi

సర్టిఫికెట్లు అమ్ముకుంటారా?

కొన్ని యూనివర్సిటీలు సర్టిఫికెట్లు అమ్ముకోవడం సహించరాని విషయమని బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) ప్రొఫెసర్ ఏఎన్ రాయ్ అన్నారు.

* యూనివర్సిటీలపైన్యాక్ డెరైక్టర్ ప్రొఫెసర్ రాయ్ ఆగ్రహం
* ఉన్నత విద్యను అభ్యసించేవారు 20 శాతం కూడా లేరని వ్యాఖ్య
* అత్యుత్తమస్థాయి విశ్వవిద్యాలయం లేకపోవడం దురదృష్టకరం
* ఘనంగా పాలమూరు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

 
సాక్షి, మహబూబ్‌నగర్: కొన్ని యూనివర్సిటీలు సర్టిఫికెట్లు అమ్ముకోవడం సహించరాని విషయమని బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) ప్రొఫెసర్ ఏఎన్ రాయ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మొదటి స్నాతకోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన 60 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల్లో దేశంలో మన దేశం రెండోస్థానంలో ఉన్నా.. ప్రపంచ అత్యుత్తమ స్థాయిలో వీటికి స్థానం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశంలో 18 నుంచి 24 ఏళ్ల మధ్యనున్న యువత ఉన్నత విద్యను అభ్యసించడంలో 20 శాతం కూడా మించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో విద్యాలయాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉన్న మొదటి తరం వారిలో అత్యధిక శాతం నిరక్ష్యరాస్యులు ఉండేవారని, ప్రస్తుత తరం వారిలో చదువుకున్న నిరక్ష్యరాసులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు లేని విద్య వల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూరడం లేదన్నారు. విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని, అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రపంచ దేశాలతో పోటీపడవచ్చన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే విశ్వవిద్యాలయాలకు సరైన నిధులు రావడంలేదని చెప్పారు. యూనివర్సిటీలు పూర్తిగా ప్రభుత్వ సాయం మీదనే ఆధారపడడం సరైంది కాదని, ప్రైవేట్ నిధులు సొంతంగా సేకరించేలా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో విద్యపై చేస్తున్న ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందన్నారు.
 
 మన దేశంలో ప్రభుత్వ విద్యాసంస్థల కంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, ఈ విషయంలో యూనివర్సిటీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అలాగే యూనివర్సిటీ నియంత్రణ మండళ్లు కూడా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి వి.భాగ్యనారాయణ,  కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement