
గుర్తు తెలియని యువతి సజీవదహనం
- హైదరాబాద్ నడిబొడ్డున దారుణం
- ఆత్మహత్య కావచ్చంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్‌లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం, నడుము వరకు ఆనవాళ్ళు కాలిపోగా, కాళ్లు, చేతులు కొద్దిభాగం మాత్రమే కాలిపోకుండా ఉన్నాయి.
నాలుక బయటకు ఉండటంతో దుండగులు గొంతుపిసికి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనాస్థలంలో రెండు వైన్ బాటిల్స్, కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టె లభించాయి. వాచీ, చిల్లర డబ్బులు, హ్యాండ్ బ్యాగ్‌ను ఫోరెన్సిక్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాగిలాలు ఘటనాస్థలం నుండి సమీపంలోని బిగ్‌బజార్ వెనక వైపునకు వెళ్లాయి. కేసు దర్యాప్తునకు నా లుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పో లీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు.
బతికున్నప్పుడే: యువతి మృతదేహానికి గాంధీ మార్చురి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిం చారు. ప్రాథమిక నివేదికలో యువతి ప్రాణాలతో ఉన్న సమయంలోనే ఒంటిపై కాలిన గాయాలయ్యాయని తేలింది. యువతి ఊపిరితిత్తుల్లో నల్లటి పొగ చేరినట్లు, కాలిన గాయాల వల్లే ఆమె చనిపోయినట్లు నివేదికలో ఉంది. శరీరం కాలుతున్న సమయంలో నాలుక దానంతట అదే నోటి బయటికి వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆమె తనంతట తాను పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఉంటే అటుఇటు పరుగెత్తే అవకాశాలుంటాయి.
ఇలాంటి ఆనవాళ్లు ఘటనాస్థలంలో కనిపించలేదు. ఎవరైనా పథకం ప్రకారం ఆమె బతికున్నప్పుడే పెట్రోల్ పోసి నిప్పంటించారా అనే అనుమానా లు కలుగుతున్నాయి. యువతి ఆచూకీ తెలిస్తేనే ఘటనకు సంబం ధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ఆధారాల కోసం అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లు వెతికే పనిలో నిమగ్నమయ్యారు.