అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి | Anantagiri to Chest Hospital | Sakshi
Sakshi News home page

అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి

Published Tue, Jan 27 2015 3:36 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి - Sakshi

అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం) త్వరలో కనుమరుగు కానుంది. ఈ అటవీ క్షేత్రంలో సంజీవని మొక్కలు ఉన్నాయని, వాటి గాలి క్షయ నివారణకు ఔషధంగా పనిచేస్తుందని భావించిన నాటి నిజాం.. 46 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ క్షయ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఈ వైద్యశాలను గాలికి వదిలివేయడంతో పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది. పదిలోపు రోగులుంటే.. 200 మంది పైచిలుకు వైద్యులుండడంతో ఈ ఆస్పత్రి నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

ఈ క్రమంలోనే టీబీ శానిటోరియంను ఎత్తివేసి.. దాని స్థానే మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న వీటిని ఇక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు.
 
స్థానికుల నుంచి వ్యతిరేకత

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతగిరిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తామని, ఉద్యాన లేదా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు వాటి స్థానే పిచ్చాస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి తెరమీదకు రావడంతో స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గతంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడే చాతి వైద్యశాల, మానసిక వికలాంగుల చికిత్సాలయం తరలింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చినప్పటికీ, అధికారపార్టీ ప్రతినిధులు తిప్పికొట్టారు.

తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి రావడం టీఆర్‌ఎస్ నాయకులను ఆత్మరక్షణలో పడేస్తోంది. నగరానికి సమీపంలో మంచి పర్యావరణం, ప్రముఖ అనంతపద్మనాభస్వామి దేవాలయం కొలువుదీరిన అనంతగిరిని టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేయకుండా ఆస్పత్రులతో నింపేయడమేమిటనే వాదన వినిపిస్తోంది. అయితే, టీబీ శానిటోరియంను ఎత్తివేసే ఆలోచన ప్రతిపాదనలేదని, కొత్తగా వచ్చే ఆస్పత్రుల్లో వీటిని విలీనం చేసి.. ప్రస్తుత వైద్యసిబ్బంది సేవలను వినియోగించుకుంటారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement