కేసీఆర్ కంటే ఆంధ్రులే నయం | andhra leaders ruling is better than kcr ruling | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కంటే ఆంధ్రులే నయం

Published Sat, Aug 2 2014 1:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్ కంటే ఆంధ్రులే నయం - Sakshi

కేసీఆర్ కంటే ఆంధ్రులే నయం

డీసీసీ ఉపాధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు

మెదక్ రూరల్:  తెలంగాణ సీఎం కేసీఆర్  పాలనకన్నా, ఆంధ్రుల పాలన ఎంతో బాగుండేదని డీసీసీ ఉపాధ్యక్షుడు  మామిళ్ల ఆంజనేయులు  అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మెదక్-నిజమాబాద్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారనీ, అదే జరిగితే మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. గతంలో పోచారం ప్రాజెక్టును నిర్మించటంతో మెదక్ మండలంలోని మిరుగుడుపల్లి అనే గ్రామం కనుమరుగైందని ఆయన తెలిపారు.
 
ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తుపెంచితే మండలంలోని భూర్గుపల్లి, వాడి, రాజిపేట, గాజిరెడ్డిపల్లిలు పూర్తిగా ముంపునకు గురవుతాయన్నారు. పోచారం ప్రాజెక్టు వల్ల మెదక్ మండలంలోని పలు గ్రామాలు మునిగిపోతుంటే, ప్రాజెక్టునీరు మాత్రం నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాత్రమే దక్కుతుందన్నారు. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచితే అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరం పేట మండలాల్లోని అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం మెదక్ జిల్లాలోని గ్రామాలకు నష్టం కల్గించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
 
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లాభమెంత..నష్టమెంత అని ఉమ్మడి రాష్ట్రంలోని సర్కార్ ఆలోచించేదని, కానీ కేసీఆర్ అవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నారు.  పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని తాము ఏమాత్రం ఒప్పుకోమని, ఒకవేళ అదే జరిగితే దేనికైనా సిద్ధమేనన్నారు. ఇప్పటికే మెదక్‌కు మంజూరైన మక్కల పరిశోధనా కేంద్రం, హార్టికల్చర్, ఏఎంసీ ఆస్పత్రులను సిద్దిపేటకు తరలించారని ఆయన మండిపడ్డారు.
 
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్, మెదక్‌ను జిల్లా కేంద్రంగా చేస్తాడనే నమ్మకం కూడా లేదన్నారు. మెదక్ ప్రజల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నా, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే స్పందించి ఆమెను అసెంబ్లీకి పంపిన ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో హవేళిఘణపూర్ ఎంపీటీసీ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు రామచందర్‌రావు, బీమరి శ్రీను, రాములు, మంగ్యా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement