చిలుకూరు : అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సరఫరాలో చోటుచేసుకుంటున్న అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు త్వరలో ఆహార కమిటీలు ఏర్పాటు
చేయనున్నారు. ఈ కమిటీ పౌష్టికాహారం నాణ్యత, భద్రత, పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై నిఘా వేయనుంది.
ఆహార భద్రత కమిటీ విధులు ఇలా..
అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు ఏ లోపమూ లేకుండా సక్రమంగా ఉన్నాయా? లేదా చూడాలి.
తూకాల్లో తేడాలను పరిశీలించాలి.
అంగన్ వాడీ కేంద్రానికి అవసరమైన సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని గమనించాలి.
సభ్యుల సమక్షంలోనే ఆహార పదార్థాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కమిటీ సభ్యులంతా చూసి సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
దీని ప్రకారమే సంబంధిత సీడీపీఓ.. ఆహార కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు.
ఈ బాధ్యతలను సభ్యులు విస్మరించకుండా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది.
అక్రమాలకు చెక్. . .
మహళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 4302 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది. అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు వారానికి రెండు కోడిగుడ్లు, నెలకు ఒక పిండి ప్యాకెట్ ఇంటికి వెళ్లి అందజేస్తారు. 3 సంవత్సరాల వయస్సుపై బడిన పిల్లలు కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రోజూ 20 గ్రాముల శనగలు, 15 గ్రాముల మురుకులు, వారానికి నాలుగు కోడిగుడ్లు పెట్టాలి. గర్భిణులకు పాలు, గుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి పెడతారు. అయితే కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తక్కువుగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపుతూ ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే విలువైన పౌష్టికాహారం లబ్ధిదారులకు అందకుండా దుర్వినియోగం అవుతుందని అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో ఆహార కమిటీలను ఏర్పాటు చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ఏసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3901 అంగన్ వాడీ కేంద్రాలు, 401 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో సుమారుగా 1.75 లక్షల మంది చిన్నారులు, పౌష్టికాహారం పొందుతున్నారు. 67వేల మంది గర్భిణులు, బాలింతలు అనుబంధ పౌష్టికాహారం పొందుతున్నారు.
ఆహార కమిటీలో సభ్యులు వీరే. . .
కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహార కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఐకేపీ గ్రామ సమాఖ్య సభ్యురాలు, గర్భిణి, బాలింత, మూడు సంవత్సరాల లోపు చిన్నారి తల్లి ఒకరు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందుతుంది. ఇందుకు సంబంధింత అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం రాకపోవడంతో గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయలేదు. త్వరలో ఉన్నతస్థాయి అధికారులు జీఓ, కమిటీ నియమ నిబంధనలు విడుదల చేయనున్నారు.
పౌష్టికాహారంపై నిఘా
Published Mon, Nov 10 2014 5:41 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement