మరో చేదు అనుభవం
- టీడీపీ ఎమ్మెల్యేలకు మీడియా పాయింట్, స్పీకర్ చాంబర్‌లోకి నో ఎంట్రీ
- స్పీకర్ చాంబర్ ముందు ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు
- స్పీకర్ మౌఖిక ఆదేశాలున్నాయన్న చీఫ్ మార్షల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మీడియా పాయింట్ , స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బర్తరఫ్‌తో పాటు టీడీపీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని మంగళవారం రోజంతా స్పీకర్ చాంబర్‌లోనే నిరసన జరిపిన టీడీపీఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు టీడీఎల్‌పీ కార్యాలయంలో సమావేశమై కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద, రాజేందర్‌రెడ్డి మీడియా పాయింట్‌వద్ద మాట్లాడేందుకు బయలు దేరారు. వీరిని అక్కడే ఉన్న మార్షల్స్ అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సాయన్న, మాగంటి గోపీనాథ్, గాంధీ, మాధవరం కృష్ణారావు అక్కడికి వచ్చి ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిం చారు. తమకు స్పీకర్ నుంచి మౌఖిక ఆదేశాలున్నాయన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా మీడియా పాయింట్ వద్దకు వెళుతుంటే సభ్యులమైన తమను అడ్డుకునే హక్కు ఎక్కడిదని వారు గొడవకు దిగారు. లిఖితపూర్వక ఉత్తర్వులు తీసుకురమ్మని చీఫ్ మార్షల్‌ను కోరారు. అయినా వినకుండా మార్షల్స్ అడ్డుగా ఉంటే వారిని నెట్టుకొని వెళ్లి మీడియా పాయింట్‌లో ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు.
అనంతరం శాసనసభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని చీఫ్ మార్షల్‌పై హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. లాబీల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ చాంబర్ ముందు మరోసారి మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన శాసనసభ్యులు.. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. అరగంట తరువాత మార్షల్స్ వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
తమను గవర్నర్ వద్దకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోకుండా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించి అక్కడే వదిలేశారు. అనంతరం సొంత కార్లలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలసి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ఆందోళన చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీరిని చూసి నవ్వుతూ వెళ్లిపోయారు.
స్పీకర్‌సార్ .. ఇదేం పద్ధతి..?: సండ్ర
శాసనసభలోని సభ్యులందరి హక్కులను కాపాడాల్సిన సభాపతి ఒకరిద్దరి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. గవర్నర్‌ను కలసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హరీశ్‌రావు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. కొత్త సంప్రదాయం నెలకొల్పుతామని కేసీఆర్ చెబుతున్న మాటల అర్ధమిదేనా?’ అని ప్రశ్నించారు. శాసనసభ్యులను మీడియా పాయింట్‌కు రాకుండా, లాబీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని నిలదీశారు. తమను కలిసేందుకు స్పీకర్ ఇష్టపడడం లేదని, ఇదేం పద్ధతి అని అడిగారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తలసాని దొంగ రాజీనామా చేశారు. దాన్ని ఏం చేయబోతున్నారో కూడా స్పీకర్ చెప్పడం లేదన్నారు.