చీకటి పాలన!
- క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం .. కాపుల ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం
- ‘సాక్షి’ చానల్‌పై మూడో రోజూ నిషేధం.. మిగతా చానళ్ల ప్రసారాలపైనా ఒత్తిడి
సాక్షి నెట్‌వర్క్: కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై రాష్ట్ర సర్కారు దమనకాండ కొనసాగిస్తోంది. పోరాటాన్ని పూర్తిగా అణగదొక్కడమే లక్ష్యంగా నేతలపై విరుచుకుపడుతోంది. నోరువిప్పడానికి కూడా అవకాశం లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధిస్తోంది. శనివారం రాష్ట్ర బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసులతో బలప్రయోగం చేసింది. అయినా ప్రజలు పలు చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కాపు రిజర్వేషన్ల కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు.
ముద్రగడ దీక్ష, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం మీడియా గొంతును నొక్కేసింది. ‘సాక్షి’తోపాటు మరో రెండు చానళ్లను పూర్తిగా నిలిపివేసింది. మిగిలిన చానళ్లపై ఒత్తిడి తెచ్చి ఉద్యమ సమాచారం ప్రజలకు తెలియకుండా చేస్తోంది. ముద్రగడను చూసేందుకు మీడియాను కూడా అనుమతించడం లేదు. రాజ్యాంగం కల్పించిన సమాచార హక్కును సైతం ప్రభుత్వం కాలరాచిందని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చీకటి పాలన సాగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం పట్ల కాపు సామాజిక వర్గంలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం కక్షకట్టి తమ ఉద్యమాన్ని అణచివేస్తోందని కాపు నేతలు ఆరోపిస్తున్నాయి. ముద్రగడకు జరగరానిది ఏదైనా జరిగితే గతంలో రంగా హత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
నీరసించిన ముద్రగడ
మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ నీరసించి పోయారు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ శర్మ ఆధ్వర్యంలో ఆరుగురు వైద్యులతో కూడిన బృందం బలవంతంగా వైద్యం చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించారు. తలను ఆస్పత్రి బెడ్‌కున్న ఇనుపరాడ్‌కు ముద్రగడ కొట్టుకోగా స్వల్ప గాయమైంది. తన వద్దకు రావద్దని వైద్యులు, అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ముద్రగడకు మధుమేహం ఉండడంతో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ముత్రపిండాలకుప్రమాదం తప్పదని వైద్యులు చెప్పారు.
ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారుడు గిరి, కోడలు సిరి మంచినీరు తీసుకుంటుండడంతో వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా, దీక్ష సమయంలో ముద్రగడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో సెక్షన్ 309, నిబంధనలను ఉల్లంఘించడంతో సెక్షన్ 188 ప్రకారం అదుపులోకి తీసుకున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ వెల్లడించారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాపు నాడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో శనివారం బంద్ విజయవంతమైంది. ప్రభుత్వం పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులను నడిపించింది. పోలీసులు ఎక్కడికక్కడ కాపు నాయకులను, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ఢిల్లీ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించింది. కాపులను దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సీపట్నంలో కాపులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బలవంతంగానైనా వైద్యం చేయాలి
ముద్రగడ ఆరోగ్యంపై వైద్యులు
కోటగుమ్మం (రాజమహేంద్రవరం): మూడు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ముద్రగడ పద్మనాభం శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిశోర్ చెప్పారు. ముద్రగడ ఆరోగ్యం పరిస్థితిపై శనివారం రాత్రి 9 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 గంటలుగా ఆహారం తీసుకోవడం లేదని, పరిస్థితి ఇలానే కొనసాగితే ముద్రగడ ఆరోగ్యం బాగా క్షీణిస్తుందన్నారు. ఆయన వైద్య పరీక్షలకు కూడా అంగీకరించడం లేదని చెప్పారు. ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా, చికిత్స చేయాలన్నా ముందుగా మూత్రం, రక్త పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. అందుకు ముద్రగడ అంగీకరించడం లేదన్నారు. పరిస్థితిని బట్టి ఆదివారం ఉదయం బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించి వైద్యం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.