
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వనుంది. గతనెల 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియగా... క్షేత్రస్థాయిలో దాదాపు 30వేల మంది విద్యార్థులు ఈపాస్ వెబ్‌సైట్‌ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్!ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్!లో వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. ఈక్రమంలో గడువు ముగియడంతో ఆయా విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలకు వినతులు వెల్లువెత్తాయి.
మరోవైపు బీఈడీ, లాసెట్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ సైతం గతనెలాఖరుకు ముగియకపోవడంతో ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తుల నమోదుకు అవకాశం ఇవ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈమేరకు రెండ్రోజుల క్రితం ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
నెలరోజులు పెంపు!
2017–18 వార్షిక సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు 13.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 13.30 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా... 25వేల దరఖాస్తులు తగ్గాయి. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి జూన్ 20న ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఆగస్టు వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లోనూ జాప్యం జరిగింది.
దీంతో అక్టోబర్, నవంబర్‌లో దరఖాస్తుకు మళ్లీ అవకాశం కల్పించింది. 95శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో పలువురు విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా ఆయా విద్యార్థులతో పాటు, బీఈడీ, లాసెట్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 50వేల మందికి అవకాశం కల్పించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడితే వచ్చే ఏడాది జనవరి నెల మొత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని సంక్షేమాధికారులు చెబుతున్నారు.