బాప్‘రేవ్’!
శివారులో రేవ్ పార్టీల జోరు
* ఈవెంట్స్ పేరిట యువతకు ఎర
* అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు
* నిద్రావస్థలో పోలీసులు
మేడ్చల్: నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగరవాసులు వీకెండ్‌లో సేదదీరేం దుకు.. జాలీగా గడిపేందుకు ఏర్పాటైన రిసార్టుల స్వరూపం మారుతోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని ‘రేవ్ పార్టీల’ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అర్థనగ్న నృత్యాలు, అశ్లీల కార్యక్రమాలు, మద్యం పార్టీలు నిర్వహిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల్లో పదుల సంఖ్యలో రిసార్ట్‌లు వెలిశాయి. కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు వారంలో ఏదో ఒకరోజు రిసార్ట్‌కు వచ్చి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం వీటి ప్రధాన ఉద్దేశం. వీటిలో ముందుగా సభ్యత్వం తీసుకుని ఉండాలి. రిసార్ట్‌లో సభ్యులకే అనుమతి ఉంటుంది. అయితే యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని నిర్వాహకులు రేవ్ పార్టీలంటూ ఎరవేస్తున్నారు.
నగరంలో నిఘా పెరగడంతో..
* నగరంలో పబ్‌లు, లాడ్జీలపై పోలీసుల నిఘా పెరగడంతో నగర శివారులోని రిసార్ట్‌లను క్లబ్బులుగా మార్చేశారు. ఇతర నగరాల నుంచి డ్యాన్సర్లను రప్పించి అందమైన షోలు నిర్వహిస్తూ యువకులను ఆకర్షిస్తున్నారు. రేవ్ పార్టీల పేరుతో అర్థనగ్న నృత్యాలు చేయిస్తూ దండుకుంటున్నారు.
కొన్ని సంఘటనలు..
* 2011 సెప్టెంబర్ 6న శామీర్‌పేట్ రాజీవ్హ్రదారిపై మేడ్చల్ మండలం మురహరిపల్లిలోని ఓ రిసార్ట్‌పై పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 40మందికిపైగా యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.
* 2011 నవంబర్ 14న మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ శివారులో ఉన్న ఓ రిసార్ట్‌పై దాడులు నిర్వహించగా 30మంది యువతీయువకులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
* ఇటీవల మేడ్చల్ మండలంలోని రిసార్ట్ పరిధిలో ఉన్న ఓ భవనంలో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. 30మంది యువతీయువకులను అరెస్టు చేశారు.
* మండల పరిధిలోని తుర్కపల్లిలో ఉన్న ఓ పాత పౌల్ట్రీఫాంలో ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.
* తాజాగా మేడ్చల్ మండలం యాడారం సమీపంలోని ఓ రిసార్‌టలో అశ్లీల నృత్యాలు చేస్తూ పలువురు యువతీయువకులు పట్టుబడ్డారు.
పథకం ప్రకారమే..
రిసార్‌ట నిర్వాహకులు పథకం ప్రకారమే అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ఉండే యువతను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు పన్నుతున్నారు. ఆర్థికస్థోమత ఉన్న యువతను టార్గెట్ చేసి రేవ్ పార్టీల పేరుతో వల వేస్తున్నారు. మద్యం, జూదం, హుక్కాలతో జల్సాలకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. నగరంలో నలుగురైదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు తెలిసినా మామూళ్ల మత్తు లో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.