కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment