కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి ఆ తీర్పును పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వక ధిక్కారమే. కనుక వారిపై చర్యలు తీసుకోండి’’అని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యు లు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. తమ శాసనసభ్యత్వాలపై హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి తమ సభ్యత్వాలను పునరుద్ధరించడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనన్నారు.
‘‘మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని, మా అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. దానిపై 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా చేయలేదు. దాంతో సింగిల్ జడ్జి తీర్పే అంతిమం. కేసుతో సంబంధం లేని 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం అనుమతినివ్వలేదు. అప్పీల్ వేయాల్సింది అసెంబ్లీ కార్యదర్శేనని స్పష్టం చేసింది. ఆయన రాజకీయ కారణాలతో కావాలనే ఇప్పటిదాకా వేయలేదు. పైగా కోర్టు తీర్పునూ అమలు చేయలేదు. ఈ వ్యవ హారంలో అన్ని విషయాలూ న్యాయ శాఖ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలివ్వండి’’అని కోర్టును వారు కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం విచారించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment