మాతాశిశు సంరక్షణపై దృష్టి
► అమ్మ ఒడి పథకం నేపథ్యంలో నియామకాలు
► త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా వందలాది పోస్టుల భర్తీ
► ఆసుపత్రుల్లో బాలింతల మరణాలు తగ్గించేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నీలోఫర్, గాంధీ తదితర ప్రధాన ఆసుపత్రుల్లో వరుసగా జరి గిన బాలింతల మరణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. మరోవైపు సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యాన్ని గాడిలో పెట్టాలని, మాతాశిశు సంరక్షణపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే గర్భిణీలకు పోత్సాహ కం కింద రూ.12 వేలు ఇచ్చే పథకం జూన్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు కేసీఆర్ కిట్ పేరుతో బాలింతలు, పుట్టిన శిశువులకు అవసరమైన వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకాలు విజయవంతం కావాలంటే వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలు భారీగా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.
టీఎస్‌పీఎస్సీకి భర్తీ బాధ్యత...
వివిధ ఆసుపత్రులకు 2,118 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కారు ఆ మధ్య ఆమోదం తెలిపింది. వాటిని భర్తీ చేయాలని టీఎస్‌పీ ఎస్సీకు ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో... కాంట్రాక్టు, ఔట్‌సోర్సిం గ్ పద్ధతిలో 432 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులపై దృష్టిసారించి సోమవారం 1,099 పోస్టులు మంజూరు చేసింది. ఆయా ఆసుపత్రులకు 111 యూనిట్లు మంజూరు చేస్తే అందులో అధికంగా మాతా శిశు సంరక్ష ణకే ప్రాధాన్యమిచ్చారు.
బాలింత, శిశుమర ణాలను తగ్గించాలనే ఉద్దేశంతో స్త్రీ వైద్యం కోసం 26, పిల్లల వైద్యం కోసం 12, మత్తు మందు వైద్యంకోసం 29 యూనిట్లు మంజూ రు చేశారు. ఆ యూనిట్లలో భాగంగా మాతా శిశు సంరక్షణ కోసం 78 మంది గైనకాల జిస్టులు, 36 మంది పిల్లల వైద్య నిపుణులు, ఐసీయూలు, ఆపరేషన్ల కోసం 87 మంది మత్తు మందు నిపుణులను తీసుకోవాలని నిర్ణయించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ మినహా ఇతర ఉద్యోగాలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేస్తారు.
భర్తీలోనే జాప్యం...
ప్రభుత్వం విరివిగా పోస్టులను మంజూరు చేస్తున్నా, వాటి భర్తీకి ఆదేశించినా టీఎస్‌పీఎస్సీ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం పై నిరుద్యోగులు ఆందోళన చెందు తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపించడం, వాటిని ప్రభుత్వం ఆమోదించడం వరకే పరిమితమవుతుందని, కానీ టీఎస్‌పీ ఎస్సీ మాత్రం స్పందించడం లేదని వైద్య నిరుద్యోగ అభ్యర్థులు విమర్శిస్తున్నారు.