మొండి చెయ్యే! | As it happened: Telangana State full Budget | Sakshi
Sakshi News home page

మొండి చెయ్యే!

Published Wed, Mar 11 2015 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక బడ్జెట్ జిల్లా ప్రజానికాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.

- ఊరించి.. ఉసూరుమనిపించిన బడ్జెట్
- జిల్లా వాసులను తీవ్ర నిరాశపరిచిన పద్దు
- సాగునీటి కోసం అత్తెసరు నిధులు
- కేవలం రూ.81లక్షలతో సరిపెట్టిన వైనం
- పాలమూరు ఎత్తిపోతలకు రూ.100 కోట్లే
- జీతాల పెంపుతో అంగన్‌వాడీ వర్కర్లలో ఆనందం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక బడ్జెట్ జిల్లా ప్రజానికాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ సర్కారు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. ఫార్మా సిటీ, ఫిల్మ్ సిటీ అంటూ సర్కారు హడావుడి చేయడం.. మరోవైపు క్రమబద్ధీకరణతో భారీగా ఖజానా నింపుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని భావించారు. కానీ బుధవారం నాటి బడ్జెట్ నిరుత్సాహానికి గురిచేసింది.

జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి తాజా బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఈ నిధులు సర్వే పనులకు అంతంతమాత్రంగా సరిపోనుండగా.. ఈ ప్రాజెక్టు తొలదశలో జిల్లాకు స్థానం లేకుండా పోయింది. ఫలితంగా తాజా బడ్జెట్లో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు ఏమాత్రం పరిష్కరం లభించలేదని స్పష్టమవుతోంది.
 
రూ. 81.81లక్షలు మాత్రమే..
- ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కేవలం రూ.81.81 లక్షలు మాత్రమే విదిల్చింది. చిన్ననీటి ప్రాజెక్టులైన జుంటుపల్లి, లక్నాపూర్, కోటిపల్లి ప్రాజెక్టుల మరమ్మతులు, అభివృద్ధికి ఈ నిధులు కేటాయిం చింది. జుంటుపల్లి ప్రాజెక్టుకు అత్యల్ప ంగా రూ.2.74లక్షలు కేటాయిం చగా, లక్నాపూర్ ప్రాజెక్టుకు రూ.46.06 లక్షలు, కోటిపల్లి ప్రాజెక్టుకు రూ.33.01లక్షలు మంజూరు చేసింది.
- పర్యటక ప్రాంతంగా అనంతగిరిని తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా నగరంలోని పిచ్చాస్పత్రి, క్షయ ఆస్పత్రులను అనంతగిరికి తరలించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనంతగిరికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే వికారాబాద్ వాసులకు కొంతైనా ఊరట లభించేది. కానీ ప్రభుత్వం పర్యటక అభివృద్ధిపై ప్రత్యేకించి అనంతగిరికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకపోవడం గమనార్హం.
- పారిశ్రామికంగా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ఇటీవల పలు సందర్భాల్లో జిల్లానుద్దేశించి ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఏరియల్ సర్వేచేసి హడావుడి చేశారు. వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో వీటిపై ప్రత్యేకంగా పేర్కొన అంశాలేవీ లేవు.

జిల్లాలో గత ప్రభుత్వాలు వేల ఎకరాల భూములను సేకరించి ఆర్థిక మండళ్లకు కట్టబెట్టింది. ఈ క్రమంలో స్థానిక రైతాంగం తీవ్రంగా నష్టపోగా.. కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. తాజాగా ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీల పేరిట వేలాది ఎకరాల భూములను గుర్తించి ఏరియల్ సర్వే చేపట్టారు. దీంతో ఈ భూములను సేకరిస్తే జిల్లా ఆస్తులు భారీగా అంతరించిపోనున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా జిల్లా ప్రజలకు ఇతర ఉత్పాదక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అవకాశం కల్పించాలి. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఇవేవీ ప్రస్తావించలేదు.
 
కలల ప్రాజెక్టు ఊసేదీ?
తెలంగాణ ప్రభుత్వ కలల ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ పలుమార్లు వేదికలపై ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యపై తాజా బడ్జెట్‌లో ప్రస్తావన రాకపోవడంతో విద్యార్థిలోకం తీవ్ర నిరుత్సాహంలో మునిగింది. తొలి ఏడాది ఆర్నెళ్ల బడ్జెట్ అంటూ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున అందరూ కేజీ టూీ పజీపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ తాజా బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు పైసా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా లేదు.

బడ్జెట్‌లో కలల ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిధులు కేటాయించకుండా ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ మేరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సదానంద్, ప్రవీణ్, ఏవీ సుధాకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, గాలయ్య, తెలంగాణ పీఆర్‌టీయూ ఉపాధ్యక్షులు సత్తారి రాజిరెడ్డి వేరువేరు ప్రకటనల్లో నిరసన తెలిపారు.
 
అంగన్‌వాడీ వర్కర్లకు కానుక
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి భారీ బహుమతిని ప్రకటించింది. వారి వేతనాలను పెద్ద సంఖ్యలో పెంచింది. అంగన్‌వాడీ కార్యకర్త వేతనం రూ.4,200 నుంచి రూ.7 వేలకు పెంచింది. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్ర సహాయకురాలి వేతనం రూ.2,450 నుంచి రూ.4,500కు హెచ్చించింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రస్తుతం జిల్లాలో 2,524 అంగన్‌వాడీ కేంద్రాలు, 269 మినీ కేంద్రాలున్నాయి.

వీటి పరిధిలో 2,524 అంగన్‌వాడీ కార్యకర్తలు, 2,524 మంది సహాయకులు, 269 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలున్నారు. తాజా ప్రభుత్వ ప్రకటనతో 5,317 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ప్రభావంతో జిల్లాపై నెలకు రూ.1.28కోట్లు, ఏడాదిలో ఖజానాపై రూ.15.36 కోట్ల భారం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement