పార్టీ ముఖ్యనేతలు గైర్హాజరు
కసితో సభ్యత్వం చేయించాలని పొన్నాల పిలుపు
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలిరోజు పేలవంగా సాగింది. గాంధీభవన్ ఆవరణలో శనివారం చేపట్టిన కార్యక్రమానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీని వాస్‌సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు రాలేదు. కార్యకర్తలు, నాయకుల హాజరు శాతం కూడా పలుచగా ఉంది. వచ్చిన వారూ సభ్యత్వ నమోదుపట్ల అంతగా ఆసక్తి చూపలేదు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సభ్యత్వ నమోదును గంట సేపటికే ముగించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తొలి సభ్యత్వ రశీదును మాజీమంత్రి దానం నాగేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన కాం గ్రెస్ పార్టీలో సభ్యుడిగా కొనసాగే అవకాశం దక్కడం తన జీవి తంలో మర్చిపోలేని అదృష్టమన్నారు. నాయకులంతా వాడవాడలా పర్యటించి కసిగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని నమోదు చేయిం చాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చుని సభ్యత్వ నమోదు పుస్తకాలను నింపితే పార్టీని మోసం చేసినట్లేనని, ఒక్క సంక్షిప్త సందేశమిస్తే పార్టీ కార్యక్రమానికి హాజరయ్యే వారికే సభ్యత్వం ఇవ్వాలని కోరారు. శాసనమండలిలో ఉపనేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కళకళలాడిన డీఎస్ నివాసం
మండలి ప్రతిపక్షనేత డి. శ్రీనివాస్ నివాసం శనివారం కళకళలాడింది. డీఎస్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర కార్పొరేటర్లు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇష్టం లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరపాల్సిందేనని కార్యకర్తలు ఒత్తిడి తేవడంతో వారి మాటను కాదనలేకపోయానని పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలు
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోదాడ ఎమ్మెల్యే పద్మా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలితతోపాటు పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ సాంప్రదాయక నృత్యాలు చేశారు.
పేలవంగా టీపీసీసీ సభ్యత్వ నమోదు
Published Sun, Sep 28 2014 12:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement