మార్కెట్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు
వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో దశలవారీగా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురానున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ల కాలపరిమితిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ, కొత్తగా 40మార్కెట్ యార్డుల ఏర్పాటుపై శుక్రవారం ఆయన ప్రతిపాదించిన సవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది.
వరంగల్ పోలీసు బిల్లుకు ఆమోదం
కమిషనరేట్‌కు సంబంధించి వరంగల్ (మహానగర ప్రాంత) పోలీసు బిల్లు, 2015 శాసనమండలి ఆమోదం పొందింది. ఈ కమిషనరేట్‌ను వరంగల్, హన్మకొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఖాజీపేట, వర్ధన్నపేటలను కలిపి ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం కౌన్సిల్‌లో ఈ బిల్లును ప్రతిపాదిస్తూ చెప్పారు.
వ్యాట్ సవరణ బిల్లుకు కూడా..
తెలంగాణ విలువ ఆధారిత పన్ను (సవరణ) బిల్లు, 2015కు శాసనమండలి ఆమోదం తెలిపింది. 2005లో తెచ్చిన ఈ చట్టాన్ని కొంతమేర సవరించి ప్రభుత్వానికి తగిన రాబడి వచ్చేలా మార్పులు ప్రతిపాదించినట్లు బిల్లును ప్రవేశపెడుతూ వాణిజ్యశాఖ మంత్రి తలసాని తెలిపారు. ఖాళీ మద్యం బాటిళ్లను తిరిగి కొనుగోలు చేసే విధానంలో చిల్లర వర్తకుల నుంచి కాకుండా బెవరేజస్, డిస్టిలరీలు నేరుగా పన్ను చెల్లించేలా సవరణలు తెస్తున్నట్లు చెప్పారు.
రైతు యూనిట్‌గా పంటల బీమా పథకం
పంటల బీమా పథకాల కింద గ్రామాన్ని, మండలాన్ని, జిల్లా యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకోవాలని, రైస్‌మిల్ లెవీని 25 శాతంగా ఇకముందు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రైతులకు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైస్‌లెవీని 25 శాతంగా ఇకముందు కూడా కొనసాగించాలనే తీర్మానాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా రైతును ఒక యూనిట్ ప్రాతిపదికన వ్యవసాయ బీమా పథకాన్ని అమలుచేయాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది.
తలసాని మంత్రిగా ఎలా ఉంటారు?: షబ్బీర్
తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా కొనసాగుతారని శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ సభ్యులు 65 మంది (ఇద్దరు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు కలుపుకొని), టీడీపీ 15 మంది, కాంగ్రెస్ 25మంది సభ్యులున్నట్లు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి విడుదల చేసిన జాబితాను బట్టి స్పష్టమవుతోందన్నారు. టీడీపీ సభ్యుడిగా ఉన్న ఆయన మంత్రిగా ఎలా ఉంటారని షబ్బీర్ అలీ ప్రస్తావించారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఇది అసెంబ్లీ స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఇక్కడ చర్చించలేమన్నారు.
స్పీకర్‌పై అదృశ్యశక్తుల ఒత్తిడి: భట్టి
శాసనసభ స్పీకర్‌పై అదృశ్యశక్తులు ఒత్తిడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సీఎల్పీ ఉపనాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై, ఆచరణ సాధ్యంకాని హామీలపై ప్రశ్నించాలని ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే రాలేదన్నారు. అధికారపక్షం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని భట్టి విమర్శించారు.
ప్రతిపక్షాలపై వివక్ష : ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షను చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువుల మంజూరులో అధికారపార్టీకి చెందిన వారికి ఎక్కువగా కేటాయించారని, ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై వివక్షను చూపించారని ఆరోపించారు.
బీసీలకు సముచిత కేటాయింపులు లేవు
బీసీలకు బడ్జెట్‌లో సముచితమైన కేటాయింపులు చేయలేదని, వారికి సరైన పథకాలు పెట్టలేదని కౌన్సిల్‌లో విపక్షనేత డి.శ్రీనివాస్ విమర్శించారు. బీసీల జనాభాపై స్పష్టత తెచ్చి రాష్ర్టంలో 51శాతం బీసీలున్నారని తేల్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడారు.
మార్కెట్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు
Published Sat, Mar 28 2015 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
Advertisement
Advertisement