వరంగల్ సభ తర్వాత అసెంబ్లీ: కేసీఆర్
– నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి
‘‘ఈ ప్లీనరీ సందేశం రైతే రాజు. ఆ రైతును ఆదుకునేందుకు ఎంతదాకా అయినా వెళ్తాం..’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులను దగా చేస్తున్న కల్తీ విత్తనాల వ్యవహారాన్ని ఇక ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ‘‘కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతుల గోస పోసుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉక్కుపాదం మోపుతం. ఇందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తం. అసెంబ్లీ ఇంకా ప్రోరోగ్ కాలేదు కాబట్టి వరంగల్ బహిరంగ సభ తర్వాత ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు బిల్లును పెడతాం’’అని ప్లీనరీ ముగింపు సందర్భంగా ప్రసంగిస్తూ వెల్లడించారు. కల్తీ విత్తనాలతో రైతులు ఎంత నష్టపోతే అంత నష్ట పరిహారాన్ని సంబంధిత విత్తన కంపెనీల నుంచి ఇప్పిస్తామని స్పష్టంచేశారు.
‘‘సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా అవినీతమయమైనవి. వారి హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. వారి నాయకత్వమే దోపిడీలో వాటా కలిగి ఉండేది. దీనికి ఒక్క ఉదాహరణ చెబుతా.. ఇసుక వ్యాపారంలో కాంగ్రెస్ దోపిడీ మామూలుగా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం రూ.22 కోట్లు. ఆ తర్వాత ఏడాది అది రూ.10 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పాటు నాటికి ఇసుక ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.5 లక్షలు. మేం ఇసుక పాలసీ తెచ్చాక గత ఏడాది రాష్ట్రానికి రూ.370 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఈ ఏడాది రూ.460 కోట్లకు చేరింది. రూ.5 లక్షల ఆదాయం ఎక్కడ? రూ.460 కోట్లు ఎక్కడ?’’అని అన్నారు. తాము కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తున్నామని, అవినీతి రహితంగా ఉన్నామని తెఉలిపారు.
‘‘అనవసరమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించొద్దు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తారో.. సంబంధిత మంత్రులు ఆలోచించాలి. కేసులు పెట్టాలి..’’అని సూచించారు. అవినీతికి దూరంగా ఉంటున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సంక్షేమ పథకాల కోసం 130 జీవోలు జారీ చేశామని, ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాలికలకు 20 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, విడతల వారీగా రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, ఆసుపత్రుల్లో అనవసర ఆపరేషన్లను నియంత్రించే అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.