అనుసంధానం అంతంతే | At the end of the integration | Sakshi
Sakshi News home page

అనుసంధానం అంతంతే

Published Fri, Jan 2 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

అనుసంధానం అంతంతే

అనుసంధానం అంతంతే

ఆధార్ అనుసంధానం జిల్లాలో ప్రహసనంగా మారింది. తొలుత అనుసంధానం తప్పనిసరంటూ అధికారులు హడావుడి చేసినా.. ఆ తర్వాతతప్పనిసరి కాదని తేలడంతో జనం అంతగా ఆసక్తి చూపలేదు. అయితే కేంద్రం ఇపుడు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంతో పాటు గడువు విధించినా, జిల్లాలో 50 శాతమే ఆధార్ సీడింగ్ పూర్తయింది.

మరోవైపు అధికారులు మాత్రం అనుసంధానం ఉంటేనే సబ్సిడీ వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు. సాంకేతిక, ఇతర సమస్య నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పొడిగించినప్పటికీ గ్యాస్ సబ్సిడీ లభించాలంటే మాత్రం ప్రస్తుతానికి పూర్తి మొత్తం డబ్బు చెల్లించాలని చెబుతున్నారు.
 
 సిద్దిపేటకు చెందిన సురేష్, కొండాపూర్‌కు చెందిన జగదీష్‌లు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును అనుసంధానం చేయలేదు. ప్రస్తుతం వీరు పూర్తి మొత్తం చెల్లిస్తేనే గ్యాస్ కంపెనీ సిలిండర్ ఇస్తుంది. సబ్సిడీ మొత్తం మాత్రం వీరి బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. ఇది కూడా కేవలం మూడు నెలలే. అప్పటికీ ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఏప్రిల్ నుంచి సబ్సిడీ డబ్బులు వీరికి లభించవు.
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ఏళ్లకేళ్లు గడుస్తున్నా వంట గ్యాస్-ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సర్కార్ గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆ తర్వాత కోర్టుల జోక్యంతో ఆధార్ బాధ తప్పిందని జనమంతా సంబరపడ్డారు. అయితే ఆధార్‌ను అనుసంధానం చేస్తేనే గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చే నిబంధనను సర్కార్ మళ్లీ అమల్లోకి తెచ్చింది.

గ్యాస్ సిలిండర్‌కు ఇచ్చే రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చే సేస్తోంది. అయినప్పటికీ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ఏమాత్రం పెరగలేదు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 50 శాతం వినియోగదారులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేయించుకున్నారు.  ప్రస్తుతం జిల్లాలో 5,07,916 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 3,52,000 కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఇక ఆధార్-బ్యాంక్ ఖాతాల అనుసంధానమైతే కేవలం 2.50 లక్షల కనెక్షన్లకు మాత్రమే పూరై ్తంది.  

వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పుల నేపథ్యంలో మొదట్లో  వినియోగదారులు ఆధార్ అనుసంధానానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం న్యాయ స్థానాల తీర్పులను అమలు చేయకపోవడంతో ఆధార్‌తో అనుసంధానం  తప్పని సరి అయింది. అయినా వినియోగదారులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ  ఎప్పటి నుంచో కొనసా..గుతోంది.

పెరిగిన గడువు ..
వంట గ్యాస్-ఆధార్ అనుసంధానానికి తుది గడువును ఇప్పటి వరకు నాలుగైదు సార్లు పొడిగించారు. గత డిసెంబర్ 31తో తాజా గడువు కూడా ముగిసిపోయింది. అయినప్పటికీ ఆధార్ అనుసంధానంలో పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం గడువును ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు మరోసారి పొడిగించింది. దీంతో ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు సబ్సిడీపైనే గ్యాస్ అందిస్తున్నారు.

పొడిగించిన గడువులోగా ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ఆ తర్వాత రాయితీపై వంట గ్యాస్ లభించదని అధికారులు చెబుతున్నారు. గడువులోగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.900 వరకు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

ఆధారే అడ్డంకి...
కేంద్ర ప్రభుత్వం మహిళలతో జీరో అకౌంట్ బ్యాంకు ఖాతాలు తెరిపించింది. ఈ పథకానికి భారీగానే స్పందన లభించింది. మహిళలు భారీ ఎత్తున ఖాతాలు తెరిచారు. జిల్లా నుంచి భారీగా వలసలు ఉండటంతో..ప్రజలు ఆధార్ కార్డులు తీసుకోలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని పథకాలకు ఆధార్‌కార్డును తప్పని సరి చేయడంతో జనం ఆధార్ కార్డు అవసరం అర్థం చేసుకున్నారు.

ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ సెంటర్లను ఎత్తి వేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ-సేవా కేంద్రాల్లో ఆధార్‌కార్డులు ఇస్తున్నప్పటికీ, అవి సకాలంలో అందడంలేదు. ఈ నేపధ్యంలోనే గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేయించలేకపోతున్నామని వినియోగదారులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement