
చింతలకుంట గ్రామం
గట్టు/ కేటీదొడ్డి (గద్వాల): వర్షాలు సరిగా కురియకపోవడానికి ఆ గ్రామస్తులు ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను ఖననం చేయడమేనని భావించారు. చివరకు పూడ్చిన ఆ శవాలను వెలికితీసి దహనం చేస్తేనే ఫలితం ఉంటుందని నమ్మారు. ఆనుకున్నదే తడువుగా దానిని ఆచరణలో పెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వివరాలిల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరి (రెండు సామాజిక వర్గాలు) ని ఖననం చేయడంతోనే ఈ ఏడాది వర్షాలు కురియడం లేదని గ్రామస్తులు భావించారు. ఈ ఇద్దరికి శరీరంపై తెల్లమచ్చ (కుష్ఠువ్యాధి లక్షణాలు)లు ఉన్నాయని వారి మృతదేహాలను వెలికితీసి దహనం చేయాలని ఆదివారం ఉదయం నిర్ణయించుకున్నారు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాలను వెలికితీస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో గ్రామస్థులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎలాంటి మూఢనమ్మకాలు ఆచరించవద్దని గ్రామస్తులకు ఎస్‌ఐ బాలవెంకటరమణ కౌన్సెలింగ్ ఇచ్చారు.