విన్నారా.. సౌండ్‌ పడుద్ది సప్పుడు గుప్పెడే! | Awareness On Diwali Celebrations | Sakshi
Sakshi News home page

విన్నారా.. సౌండ్‌ పడుద్ది సప్పుడు గుప్పెడే!

Published Wed, Nov 7 2018 9:36 AM | Last Updated on Tue, Nov 13 2018 1:40 PM

Awareness On Diwali Celebrations - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: వెలుగు దివ్వెల కేళి.. దీపావళి పండగ ఈ ఏడాది గ్రేటర్‌లో పర్యావరణహితంగా మారనుంది. అధిక శబ్దం వెలువడే బాణసంచా పేలుళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇటు నగర పోలీసులు అటు బల్దియా అధికారులు శబ్ద, వాయుకాలుష్యంపై సమరభేరి మోగించారు. దీంతో ఈసారి దీపావళిని ఎలాంటి బాణసంచా పేలుళ్లు లేకుండా జరుపుకునేందుకు గ్రేటర్‌ సిటీజన్లు  సైతం మక్కువ చూపుతున్నారు. మహానగరంలో ఏటా ఈ పండగ సందర్భంగా సిటీజన్లు మూడురోజుల పాటు పెద్ద ఎత్తున క్రాకర్స్‌ను కాలుస్తుంటారు. గతేడాది సుమారు రూ.100 కోట్ల మేర టపాసులను బూడిద చేశారంటే దాని ద్వారా వెలువడిన శబ్ద, వాయు కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి టపాసుల అమ్మకాలు సగానికి పడిపోయినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో తాము తమిళనాడు, చైనాల నుంచి తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి చేసుకున్నట్లు చెబుతున్నారు. 

‘సుప్రీం’ షరతులతో దివ్వెల పండగ..
దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోత.. బాణసంచా వెలుగులు. అయితే, ఆ ప్రమోదం మాటున ఉన్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీపావళి వేళ బాణసంచాను రాత్రి 8 నుంచి 10 గంటలమధ్యనే కాల్చాలన్న షరతు విధించిన విషయం విదితమే. అయితే, సూప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే నగర పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ మేరకు ఆంక్షలు విధించినప్పటికీ.. సమయం దాటి టపాసులు పేల్చే వారిని అదుపుచేయడం, అవధులు దాటే కాలుష్యాన్ని లెక్కించడం, లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోళ్లు చేయాలన్న నిబంధన అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాలుష్యాన్ని లెక్కించే యంత్రాంగమేది?  
నగరంలో హెచ్‌సీయూ, సనత్‌నగర్, పాశమైలారం, జూపార్కు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం ‘కంటిన్యూయస్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, బెంజిన్, టోలిన్‌ వంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తుంది. మరో 21 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్‌ శాంప్లర్‌ వంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను మాత్రమే లెక్కగడుతోంది. ‘సుప్రీం’ మార్గదర్శకాల నేపథ్యంలో దీపావళికి వారం రోజుల ముందు, తర్వాత నగరవ్యాప్తంగా వివిధ రకాల వాయు కాలుష్యాన్ని లెక్కించేందుకు అవసరమైన సిబ్బంది, కాలుష్య నమోదు కేంద్రాలు లేకపోవడంతో అవధులు దాటే కాలుష్యాన్ని ఎవరు.. ఎలా లెక్కిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.  

సగానికి తగ్గిన టపాసుల విక్రయాలు
గ్రేటర్‌ పరిధిలో ఏటా దీపావళికి సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్‌ కొనుగోలు చేస్తుంటారు. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్‌ అమ్మకాలు సగానికి పడిపోయాయని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారం రూ.50 కోట్ల మార్కును దాటడం గగనమేనని బాణసంచా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.  

సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలివీ..
దీపావళికి ఏడు రోజుల ముందు, తర్వాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి.
దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి.
ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి.
తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి.
బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం.. ప్రజలకు అవగాహన కల్పించాలి.  
నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి.
టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

శబ్దకాలుష్యంతో జాగ్రత్త
దీపావళి టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, పెంపుడు జంతువులు ప్రమాదంలో పడినట్టే. వాయు కాలుష్యంలో సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మోతాదు భారీగా పెరిగి శ్వాసకోశ వ్యాధులు, కళ్లసంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ముఖ్యంగా టపాసులు కాల్చినపుడు వెలువడే శబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్‌ మించరాదు. కానీ నగరంలో ఇవి ఏటా 90 డెసిబుల్స్‌కు మించి నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద శబ్దాలు చిన్నారులు, పెంపుడు జంతువుల్లో విపరిణామాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతువులు 50 డెసిబుల్స్‌ దాటి వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. రాకెట్లు, భూచక్రాల వంటివి కాల్చినపుడు జంతువులకు తగిలి గాయాలపాలవుతాయి. అవి ఎపిలెప్సీ (వణుకుడు) బారిన పడతాయి. ఈ గాయాలు సమీప భవిష్యత్‌లో వాటికి పెనుముప్పుగా మారడం తథ్యం.

వాయు కాలుష్యంతో ముప్పే..
టపాసులు కాల్చగా వచ్చే పొగలో సల్ఫర్‌ డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, ధూళి రేణువులులు ప్రజల ఊపిరితిత్తులకు తీవ్ర హాని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ క్యూబిక్‌ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ ఏటా దీపావళికి సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ 450–500 మైక్రోగ్రాములకు చేరుతోంది. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ సైతం క్యూబిక్‌ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ అదీ 450–500 మైక్రోగ్రాములు దాటుతోంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక ధూళిరేణువులు(ఎస్‌పీఎం) క్యూబిక్‌ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములు మించరాదు. కానీ 300 మైక్రోగ్రాములు మించుతోంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.  

ఆనంద దీపావళి ఇలా..
ప్రమిదల్లో వెలిగించిన దీపాలు, తీరొక్క పూలతో మీ ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలను అందంగా అలంకరించి ముస్తాబు చేసుకోండి.  
తక్కువ శబ్దం వెదజల్లే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల్‌ఛడీ, పెన్సిల్స్‌ కాల్చాలి.
శబ్దాలు కాకుండా వెలుగులు విరజిమ్మే మతాబులను ఎంపిక చేసుకోవాలి.
విపరీత శబ్దాలు కర్ణభేరీకి సోకకుండా చెవుల్లో దూది పెట్టుకోవాలి.
టపాసుల మోత శృతి మించకుండా చూసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రయత్నించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement