కోర్టుకు హాజరైన ఆజాద్ భార్య
తీర్పు ఈ నెల 23కు వాయిదా
ఆజాద్ ఎన్‌కౌంటర్ రాజకీయ హత్యేనన్న ఆజాద్ సతీమణి పద్మ
ఆదిలాబాద్ క్రైం : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఆలియాస్ అజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్‌కౌంటర్ కేసు వాదనలు ఎట్టకేలకు పూర్తయ్యా యి. శుక్రవారం ఆజాద్ భార్య కె.పద్మ, ఆమె తరఫు న్యాయవాదులు సురేష్, రఘునాథ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ (ప్రథమ శ్రేణి న్యాయస్థానం) కోర్టుకు హాజరయ్యారు. ఏడాదిన్నరగా ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై ఈ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు మూడు గంటలపాటు వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 23కు వాయిదా వేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు సురేష్‌కుమార్, రఘునాథ్ పేర్కొన్నారు.
సీబీఐ విచారణ ఇలా..
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్టు పాండేల ఎన్‌కౌంటర్‌పై సుమారు రెండేళ్లపాటు విచారణ సాగింది. కేంద్ర, మావోయిస్టు పార్టీల అగ్రనేతలకు స్వామి అగ్రివేశ్ మధ్యవర్తిత్వం నడుపుతున్న సమయంలో 2010 జూలై 2న జిల్లాలోని సర్కేపల్లి-జోగాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆజాద్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చి చంపినట్లు పిటిషన్‌లో పేర్కొంటూ.. అందుకు తగిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలు సమర్పించారు.
నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటీషన్‌లో పేర్కొన్న అంశాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీం కోర్టు ఎన్‌కౌంటర్‌పై వాదనలు వినిపించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులతో ప్రభుత్వ వాదనలను వినిపించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు 2011 ఏప్రిల్ 15న కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సుమారు రెండేళ్లపాటుసీబీఐ విచారణ జరిపింది. మూడు నెలల్లో విచారణ, ఆరు వారాల్లో మధ్యంతర నివేదికలు సమర్పించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఎన్‌కౌంటర్ నిజమైందేనంటూ 2012లో 192 పేజీల నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించింది.
అయితే.. ఈ నివేదిక ప్రతులను అప్పుడే బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించినా.. ఎన్‌కౌంటర్‌లో భాగస్వాములైన పోలీసుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు ఏడాది తర్వాత సీబీఐ నివే దికలను అందుకున్న ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేష్ 2013 జూలై 2న ఆదిలాబాద్ కోర్టులో ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసులో స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్రవరిలో హాజరై తన వాదనను వినిపించారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతూ వచ్చాయి. శుక్రవారం ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇక తీర్పు ఎవరి వైపు వస్తుందో వేచిచూడాలి మరి..!
తీర్పు తమకే అనుకూలం..
తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కోర్టుకు హాజరైన పిటిషనర్ తరఫు న్యాయవాదులు భరోసా వ్యక్తం చేశారు. వాదనలు పూర్తయ్యాక వారు మాట్లాడారు. నేరస్తులను తప్పించేలా అప్పటి ప్రభుత్వం సీబీఐతో తప్పుడు నివేదికలు తయారు చేయించిందన్నారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిందంబరం ఆదేశాల మేరకే ఆజాద్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లన్నీ బూటకమేనన్నారు. ఆత్మరక్షణ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇంత వరకు వాదనలు జరగలేదని, ప్రస్తుతం ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు వాదనలు పూర్తయినందున తమకు న్యాయం జరుగుతుందనే భరోసాతో ఉన్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందునా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ దర్యాప్తు చేపట్టాలని వారు కోరారు.
రాజకీయ హత్యలే..
రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లన్నీ రాజకీయ హత్యలేనని ఆజాద్ భార్య పద్మ పేర్కొన్నారు. ఆజాద్, హేమచంద్రల ఎన్‌కౌంటర్ బూటకమని, పోలీసులు వారిని పట్టుకుని కాల్చిచంపారని ఆరోపించారు. పోలీసులు దగ్గర నుంచే కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినా సీబీఐ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై నిజమైన ఎన్‌కౌంటర్‌గా తప్పుడు నివేదికలు తయారు చేయించాయని ఆరోపించారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌కు సంబంధమున్న పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఏడాదిన్నరపాటు కొనసాగిన ఆజాద్ ఎన్‌కౌంటర్ వాదనలు
Published Sat, Dec 13 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement