సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధరను సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 15 లక్షల 60వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో నాగం తిరుపతి రెడ్డి పెద్ద మొత్తంలో వేలం పాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వెయ్యి నూట పదహార్లతో ప్రారంభమైన వేలం పాట.. చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది.
లడ్డూను సొంతం చేసుకునేందుకు 21మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 17 మందితో పాటు కొత్తగా మరో 4 మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు అత్యధికంగా పాట పాడిన గణేష్ లడ్డూ నాగం తిరుపతి రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.14.65 లక్షల పలికిన లడ్డూ ఈ సారి 95 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే.
బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు.
1980లో మొదలై...
గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటి చెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితో పాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. 1994 నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తున్నారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు.