సాక్షి,సిటీబ్యూరో: నగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె ఎంత ఉంటుంది..? ఏ పది వేలో.. లేక పదిహేను వేల రూపాయలో అనుకుంటాం. కానీ నగరంలోని ఓ ప్రాంతంలో మాత్రం కనీసం రూ.25 వేలకు పైనే పెట్టనిదే అద్దె ఇల్లు దొరకదు. ఎందుకంటే ప్రముఖులు, వీవీఐపీలు ఉండే ప్రాంతమది. సకల హంగుల చోటది. అదే బంజారాహిల్స్. ‘హిల్స్’ అన్నందుకు కొండలంత ఉన్నతంగా ఖర్చు కూడా ఉంటుంది ఇక్కడ. జూబ్లీహిల్స్ కూడా కాస్త అటుఇటుగా ఇంతే ఖరీదైన ప్రాంతం. ‘అనరాక్ ప్రాపర్టీస్’ సంస్థ చేపట్టిన ఖరీదైన ప్రాంతాల అధ్యయనంలో బంజారాహిల్స్ టాప్‌లో నిలవగా జూబ్లీహిల్స్ రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్‌లో సంపన్నుల నివాసం ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు నాడూ.. నేడూ ఖరీదైన నివాస ప్రాంతాలుగా గుర్తింపును నిలుపుకొన్నాయి. ప్రధానంగా ఇంటి అద్దె విషయంలో గత రికార్డులను సుస్థిరం చేసుకొని ఎవర్ గ్రేట్‌గా వెలుగొందుతున్నాయి. నివాస వ్యయం పరంగా చూస్తే కొన్ని దశాబ్దాలుగా అద్దెల విషయంలోనూ ఈ ప్రాంతాలు ఆల్‌టైమ్ రికార్డును నిలబెట్టుకున్నాయి. తాజాగా ఈ ఏడాది సైతం ఇదే ట్రెండ్ కొనసాగించడం గమనార్హం.
కాస్మొపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ముఖ్యులు, ఎన్‌ఆర్‌ఐలు స్థిర, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ ప్రాంతాల్లో సువిశాల ప్రాంగణాల్లో అత్యాధునిక వసతులున్న భవంతులు అందుబాటులో ఉండటం, ఆయా నివాస సముదాయాల ప్రాంగణాల్లోనే ఐటీ, బీపీఓ, కేపీఓ, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఫార్మా ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ఆ సంస్థల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు, ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ అమాంతం పెరగుతోంది. గ్రేటర్ పరిధిలో అత్యధిక ఇంటి అద్దెలున్న ప్రాంతాలపై ఇటీవల అనరాక్ ప్రాపర్టీస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరంలో ఈ రెండు ప్రాంతాలతో పాటు హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగి, మియాపూర్, ఎల్బీనగర్ ప్రాంతాలు టాప్ టెన్ స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో సరాసరిన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అద్దెలను ప్రామాణికంగా తీసుకొని తాజా అంచనాలు రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఇంటి అద్దెలు సరాసరి తొమ్మిది శాతానికి పైగానే పెరిగినట్లు ఈ తాజా నివేదిక వెల్లడించింది.
అద్దె పెరుగుదలకు కారణాలివీ..
♦ ఐటీ, బీపీఓ, కేపీఓ, వాణిజ్య, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ తదితర సేవారంగాలతో పాటు ఫార్మా తదితర రంగాల కార్పొరేట్ కార్యాలయాలకు కేంద్రాలుగా ఉండడం.
♦ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలు, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపడం.
♦ కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులకు ఈ ప్రాంతాలు నిలయంగా మారడం. అత్యాధునిక వైద్య, విద్య సదుపాయాలు వీటి సొంతం కావడం.
♦ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, పబ్‌లు, బార్లు, లిక్కర్ మాల్స్, గేమింగ్ జోన్స్, దేశ విదేశీ వస్త్ర బ్రాండ్లు, బంగారు వజ్రాభరణాలు, లెదర్, అత్యాధునిక ఇంపోర్టెడ్ ఫర్ణిచర్ షోరూమ్‌లు ఇతర షాపింగ్ అవసరాలతో పాటు ఆకాశమే హద్దుగా వినోదాన్ని పంచే రిక్రియేషన్ జోన్లు అత్యధికంగా కొలువుదీరడం.
♦ ఇళ్లలో అత్యాధునిక ఇంటిరీయర్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, ఇతర వసతులు ఉద్యోగులను విశేషంగా ఆకర్షిస్తుండటం.
♦ ఈ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో తమ సోషల్ స్టేటస్ పెరుగుతుందని కొందరు భావించడం.
Comments
Please login to add a commentAdd a comment