సరస్వతీ నమోనమః | Basara temple teeming with devotees for Vasant Panchami | Sakshi
Sakshi News home page

సరస్వతీ నమోనమః

Published Sun, Jan 25 2015 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

సరస్వతీ నమోనమః

సరస్వతీ నమోనమః

భక్తులతో పోటెత్తిన బాసర
వైభవంగా వసంతపంచమి వేడుకలు
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
మొక్కులు తీర్చుకున్న భక్తులు
సుమారు 50వేల మంది రాక
2,128 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు


భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం బాసరలో శ్రీపంచమి(వసంత పంచమి) వేడుకలు శనివారం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, కలెక్టర్ దంపతులు, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు శనివారం వేకువజాము నుంచి దర్శనానికి బారులు తీరారు.

భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. వేకువజామున 3గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని శివాలయంలో పూజలు చేశారు. గోదావరమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ, మహాంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. పక్కనే ఉన్న వ్యాసమహార్షి ఆలయంలోనూ పూజలు చేశారు.

చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిపించారు. వసంత పంచమి కావడంతో పెద్ద మొత్తంలోనే అక్షరాభ్యాస పూజలు జరిగాయి. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో అక్షరాభ్యాస మండపాలు కిక్కిరిసిపోయాయి. మండపాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ప్రసాద కౌంటర్లు, అభిషేకం టికెట్లు తీసుకునే కౌంటర్, అక్షరాభ్యాస టికెట్లు ఇచ్చే కౌంటర్ల వద్ద బారులు తప్పలేదు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండుగా కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది.

రూ.100 అక్షరాభ్యాస మండపంలో 1,077 మంది చిన్నారులకు, రూ.1000 అక్షరాభ్యాస మండపంలో 1,051 మంది చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిగాయి. 106 రుద్రాభిషేకం, 939 మండప ప్రవేశం, 875 ప్రత్యేక దర్శనం టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రసాదాలు, అతిథిగృహాలు, అక్షరాభ్యాసాలు ఇతర ఆదాయం కలిపి రూ. 15.50 లక్షల మేర వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు
 
పూలతో అలంకరణ
వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించారు. గర్భగుడి ప్రాంగణమంతా అరటి చెట్లతో అలంకరించారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సెట్టింగు వేశారు. అక్షరాభ్యాస మండపాలను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు.
 
వీఐపీలకే గదులు
వసంత పంచమి రోజున ఆలయంలో గదులను వీఐ పీలకే కేటాయించారు. సాధారణ భక్తులకు వసతి కో సం గదులు దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక ప్రైవే టు లాడ్జిలను ఆశ్రయించారు. ఏసీ, నాన్‌ఏసీ గదులను ఎవరికీ ఇవ్వలేదు. భక్తుల తాకిడి పెరగడంతో వసతి కష్టాలు వెంటాడాయి. చలికాలం కావడంతో వచ్చిన వారంతా వసతి కోసం ఇబ్బందులు పడ్డారు.
 
భక్తుల సేవలో..
బాసర ఆలయానికి వసంతపంచమి సందర్భంగా శనివారం రోజు 50 వేల మేర భక్తులు వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఎన్‌సీసీ వాలంటీర్లు సేవలు అందించారు. జిల్లా పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాసర వెలమ సంఘం ఆధ్వర్యంలో వరుసలో ఉన్న చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. క్యూలైన్లలో భక్తులకు నీటి ప్యాకెట్లు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బలరాం పులిహోరా పంచిపెట్టారు.
 
వాహనాలను అనుమతించలేదు...
ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆలయానికి కొద్దిదూరంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపివేయించారు. బాసర వచ్చే బస్సులను బస్టాండ్ వద్దే నిలిపి వేయించారు. ఆలయంలోకి బస్సులను అనుమతించలేదు. రైలు, బస్సుమార్గాల ద్వారా వచ్చిన భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement