ఆర్టీసీలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ!
- నాలుగు నుంచి పదో తరగతి చదువు ప్రామాణికం
- ఈడీల కమిటీతో ఎండీ వరస భేటీలు
- తీవ్రమవుతున్న ఈడీ జయరావు అంశం
సాక్షి, హైదరాబాద్: నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీచేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ విభజనకు సంబంధిం చి సంస్థలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీతో సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా సోమవారం ఓ దఫా చర్చించిన ఆయన మంగళవారం మరోసారి సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపకానికి కమలనాథన్ కమిటీ విధివిధానాలను ప్రకటిం చినా, అవి ఆర్టీసీకి వర్తించనందున ఆ సంస్థకు ప్రత్యేకంగా విధివిధానాల ఖరారు తప్పనిసరైంది.
ఆప్షన్‌పై గందరగోళం...
పాఠశాల విద్యను ప్రామాణికంగా చేసుకుని స్థానికతను నిర్ధారించే విషయంలో రెండు ప్రాంతాల నుంచి దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ ‘ఆప్షన్’ల విషయంలోనే గందరగోళం నెలకొంది. తెలంగాణలో డిపో మేనేజర్ కేడర్‌లో దాదాపు 30 మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన అధికారులు పనిచేస్తున్నారు. అంతకంటే పై కేడర్‌లో మరో 9 మంది ఉన్నారు. ఆప్షన్ సదుపాయం ఇవ్వాలని ఆంధ్రాప్రాంత అధికారులు కోరుతున్నారు. దీనికి తెలంగాణ అధికారులు ససేమిరా అంటున్నారు.
సీనియర్ ఈడీ చుట్టూ వివాదం...
సీనియర్ ఈడీ జయరావు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావును ఆంధ్రకు కేటాయించాలని తెలంగాణ అధికారులు, తెలంగాణలోనే ఉంచాలని ఆంధ్రాప్రాంత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరోవైపు వెళ్తే తమ ప్రాంతానికి ఈ పోస్టు దక్కుతుందనేది వారివారి వాదన. తన విషయాన్ని రెండు ప్రభుత్వాల ముందుంచి నిర్ణయం తీసుకోవాలన్న జయరావు వాదనను పెండింగులో పెట్టడంతో వివాదం ముదురుతోంది. తాను పుట్టింది, చది వింది తెలంగాణలోనేనని, ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థినైన తనను తెలంగాణకు కేటాయించాలని జయరావు ఎండీని కోరారని తెలిసింది.
తెలంగాణ ఉద్యోగుల వాదన...
నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని స్థానికతను నిర్ధారించాలి.
జిల్లాను యూనిట్‌గా పరిగణించొద్దు.
అధికారులు, ఉద్యోగులకు ఆప్షన్ అవకాశం ఉండరాదు.
స్పౌజ్ అంశాన్ని ప్రామాణికంగా చేసుకుని కేటాయింపులు జరపరాదు
ఆంధ్రాప్రాంత ఉద్యోగుల వాదన..
నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తించొచ్చు.
అయితే ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలకు చెందిన వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వాలి.
మిగతా ప్రాంతంలోనికి వారికి... కుటుంబసభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్య/భర్త మరో రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంటే వారికి ఆప్షన్ అవకాశం కల్పించాలి.
కమలనాథన్ కమిటీ విధివిధానాలను ఆర్టీసీకి కూడా వర్తింప చేయాలి.