'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు'
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో ఏయే కులాలను చేర్చాలి, వేటిని తొలగించాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల్లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పారు. అసెంబ్లీలో సోమవారం తన చాంబర్‌కు వచ్చిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. బీసీ ఉప ప్రణాళిక వల్ల న ష్టం జరుగుతుందని అధికారులు సూచిస్తున్నారని ఆయన తెలిపారు. వాస్తవానికి బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏ పద్దు కింద ఎంతెంత ఖర్చు పెడుతున్నారో పద్దుల వారీగా లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. ఆ వివరాలు అందాక, ఉప ప్రణాళిక అయితే బావుంటుందా, లేదా ప్రస్తుత పద్ధతిలోనే ఖర్చు పెట్టాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీల్లో కులాల చేరికలు, తొలగింపులకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, నెల రోజుల్లో ఆ ప్రకటన వెలువడవచ్చని వివరించారు. ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తోందని, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనుండడం వల్ల బీసీలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయని మంత్రి జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.