- ఐటీడీఏలో నాసిరకం పనులు
- పెచ్చులూడుతున్న హాస్టల్ భవనాలు
- చినుకుపడితే చెమ్మ వస్తున్న పైకప్పు
- మరో పూత వేస్తామంటున్న ఏఈ
సాక్షి, హన్మకొండ : గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)తో గిరిజనుల కంటే ఐటీడీఏ అధికారులు, కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతున్నారు. కాగితాలపై గిరిజన సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తున్నా వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇందుకు ములుగు మండలం జాకారంలో నిర్మాణంలో ఉన్న బాలురు, బాలికల హాస్టల్ భవనాలే ఉదాహరణగా నిలుస్తాయని చెప్పవచ్చు. విద్య ద్వారానే గిరిజనుల్లో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని.. ఐటీడీఏ కోట్లాది రూపాయలు గిరిజనుల చదువు కోసం వెచ్చిస్తోంది.
ఇందులో భాగంగా ములుగు మండలం జాకారంలో ఒక్కొక్కటి కోటి రూపాయల వ్యయంతో బాలికలు, బాలురులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. గత ఏప్రిల్ ఈ భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా ప్రతీ పనిని నాసిరకంగానే చేపడుతున్నారు. నిర్మాణం పూర్తికావొచ్చిన ఈ భవనాలను ఉపయోగించకముందే పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి, గోడలకు పగళ్లు వచ్చాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, డాబాకు నీటి చెమ్మలు వచ్చాయి. ఈ భవన నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు నాసిరకంగా చేపట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పనులు నాసిరకంగా జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సి ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఎంతో నాణ్యతతో కూడుకున్నవని కితాబిస్తున్నారు. పైగా భవనానికి వచ్చిన పగుళ్లు, డాబా పెచ్చులు ఊడి పోవడం వంటిని సాధరణంగా జరిగేవే అంటూ నాసిరకం ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఏఈ జన్నపురెడ్డి రాంరెడ్డి మంగళవారం జాకారం వచ్చారు. ఈ సందర్భంగా నాసిరకం పనులపై ఆయనను ప్రశ్నించగా ‘పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. ఆ పని జరిగిన తర్వాత ఈ పగుళ్లు కనిపించవు’ అని సమాధానం ఇచ్చారు.
రెండేళ్లుగా నిర్మాణం..
ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్-2 పథకం కింద 2012-13 సంవత్సరంలో రూ. కోటి అంచనా వ్యయంతో బాలికలు, బాలురకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ మంజూరైంది. అయితే రెండేళ్ల నుంచి ఈ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ విద్యాసంవత్సర ప్రారంభమై మూడు నెలలు కావోస్తున్నా ఇంత వరకు పూర్తికాలేదు. దానితో హాస్టల్ సౌకర్యం లేక ఏజెన్సీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి
రూ. కోటితో గర్ల్స్ హాస్టల్, రూ. కోటితో బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత వేసవిలో పనులను ప్రారంభించాం. పనుల ను నిభందనలకు అనుగుణంగా నాణ్యతాగానే చేపడుతున్నాం. పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. వేసిన తరువాత ఆ పగ్గుళ్ళు కనిపించవు. ఎప్పటికి అప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. నెల రోజుల్లో పనులు పూర్తిచేసి అప్పగిస్తాం.
- జన్నపురెడ్డి రాంరెడ్డి, ఐటీడీఏ ఏఈ