బాబు యుద్ధానికి ముందే చేతులెత్తేశారు
వైఎస్సార్‌సీపీ నేత రమణ ధ్వజం
మళ్లీ మాయాకూటమితో ముందుకొస్తున్న బాబుకు మహా ఓటమి ఖాయం
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యుద్ధానికి ముందే చేతులెత్తేసి.. ఇంకా తనకేదో సామర్థ్యం ఉందని ఊదరగొట్టుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పార్టీ సీఈసీ సభ్యుడు ఒ.వి.రమణ ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిని 2009 ఎన్నికల్లో ఎదుర్కోవడానికి నాలుగైదు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి కూడా చంద్రబాబు ఓటమిపాలయ్యారని, ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తలపడటానికి మాయాకూటమిగా వస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే మూడుకాళ్ల ముసలివాడైన చంద్రబాబు రెండు మూడు పార్టీలు వచ్చి మద్దతిస్తేతప్ప నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. మాయాకూటమిలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ, సీపీఐ నారాయణ అందరూ సభ్యులేనని, వీరు చాలక ఇంకా ఎవరైనా వస్తే వారినీ కలుపుకుందామని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో మద్దతిస్తారని ఎదురు చూడడంకంటే ఆయన రాజకీయాలు వదలివేయడమే ఉత్తమమని రమణ హితవు పలికారు.
తొమ్మిదేళ్లు సీఎంగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం ప్రజాదరణను పెంచుకోలేక జగన్‌కున్న ప్రజాబలాన్ని దెబ్బకొట్టేందుకు తనతో ఎవరెవరు కలిసివస్తారా అని ఎదురుచూడడం కన్నా దేశ రాజకీయాల్లో సిగ్గులేనితనం మరొకటి లేదన్నారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా ఆయనకు ఈ ఎన్నికల్లో మహాఓటమి ఖాయమన్నారు.