
లక్కెవరిదో..!
జిల్లాలో మద్యం ప్రక్రియ మొదలైంది. 2014-15 వార్షిక సంవత్సరం కోసం మద్యం దుకాణాలు కేటాయించేందుకు జిల్లా గెజిట్ జారీ చేశారు.
ఆదిలాబాద్ : జిల్లాలో మద్యం ప్రక్రియ మొదలైంది. 2014-15 వార్షిక సంవత్సరం కోసం మద్యం దుకాణాలు కేటాయించేందుకు జిల్లా గెజిట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల ఎక్సైజ్ యూనిట్ల పరిధిలో 174 షాపులకు ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రెండు యూనిట్ల పరిధిలోని షాపులకు ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటిరోజు దరఖాస్తులు రాలేదు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 23న జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో లాటరీ ద్వారా డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
మూడు స్లాబ్‌లు
జిల్లాలో మూడు స్లాబుల విధానంలో లెసైన్స్ ఫీజును నిర్ధారించారు. 10 వేల జనాభా ఉన్న చోట రూ.32.50 లక్షలు,10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్నచోట రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న చోట రూ. 42 లక్షలు ఫీజు నిర్ధారించారు. దరఖాస్తుదారుడు రూ.25 వేల విలువ గల నాన్ రిఫండెబుల్ చలాన్, లెసైన్స్ ఫీజుపైన 1/3 శాతం ధరావత్తు (ఈఎండీ) డీడీ తీయాలి. అదేవిధంగా ఫామ్ ఏ1, ఏ2, ఏ3, ఏ4 లను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులకు చలాన్, డీడీ, రెండు కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను జత చేసి టెండర్ బాక్సులో వేయాలి.
ఏదైన జాతీయ బ్యాంకులో మాత్రమే డీడీ తీయాలి. 21 సంవత్సరాలకు లోబడి ఉన్న వ్యక్తులు అనర్హులు. మంచిర్యాల పరిధిలో 104 షాపులు, ఆదిలాబాద్ పరిధిలో 70 షాపులకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన టెండర్ బాక్సుల్లో దరఖాస్తులను వేయాలి. ఒక షాపుకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అన్ని టోకెన్లను ఒకదాంట్లో ఉంచి అందులో నుంచి ఒక టోకెన్‌ను తీయడం జరుగుతుంది. టోకెన్‌లోని నంబర్ ఆధారంగా లక్కీ విజేత ఎవరన్నది ప్రకటిస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ రోజు లాటరీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. పరాజితులకు ధరావత్తును తిరిగి ఇస్తారు.
ఇతర జిల్లాలకు 33 షాపులు తరలింపు
జిల్లాలో 207 మద్యం షాపులు ఉండగా గతేడాది నిర్వహించిన టెండర్లలో 33 షాపులకు అసలు దరఖాస్తులే రాలేదు. 11 సార్లు ఆ షాపులకు రీటెండర్లు నిర్వహించినప్పటికీ వ్యాపారులు ఎవరు ముందుకు రాలేదు. ఆయా ప్రాంతాల్లో లాభసాటిగా లేదని, ఇతర కారణాలతో అక్కడ టెండర్లకు వ్యాపారులు వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో ఆ 33 షాపులను డిమాండ్ ఉన్న ఇతర జిల్లాలకు తరలించినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కాగా క్యాతన్‌పెల్లిలోని రెండు దుకాణాలను ఆదిలాబాద్ పట్టణానికి తరలించారు. మంచిర్యాల యూనిట్ పరిధిలోని మరో రెండు షాపుల్లో ఒకటి నిర్మల్, మరొకటి ఖానాపూర్‌కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇదివరకు 5 వైన్స్‌లు ఉండగా, తాజాగా టెండర్లలో ఈ సంఖ్య ఏడుకు పెరిగింది.