మొదలైన పోస్టల్‌ పోరు | Beginning Postal Battles | Sakshi
Sakshi News home page

మొదలైన పోస్టల్‌ పోరు

Nov 23 2018 2:58 PM | Updated on Nov 23 2018 3:32 PM

Beginning Postal Battles - Sakshi

జోగిపేట(అందోల్‌): ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు అభ్యర్థుల గెలపోటములపై ప్రభావం చూపుతాయి. సాధారణ ఓట్ల ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించిన ఎన్నికల విభాగం ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్లపై దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ సారి ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న ప్రతీ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించుకునేందుకు ఎన్నికల విభాగం కార్యాచరణ ప్రారంభించింది.

ఎన్నికల్లో ఓటు ముందు వేసేది ఉద్యోగులే..
అసెంబ్లీ పోలింగ్‌ డిసెంబర్‌ 7న నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ముందుగా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. పోస్టల్‌ ద్వారా తమ ఓటును ఉద్యోగులు ముందుగానే పంపుతారు. అదేవిధంగా పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లనే మొదట లెక్కిస్తారు. గతంలో పదుల తేడాలో గెలుపోటములు ఉన్న పరిస్థితుల్లోనే పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించేవారు. కానీ ఉద్యోగుల ఓటు విలువ పెరగడం తదితర కారణాలతో  కొన్నేళ్లుగా పోస్టల్‌ బ్యాలెట్లనే ముందుగా లెక్కించే ప్రక్రియ చేపడుతున్నారు.

దరఖాస్తు నమూనాలో ఓటరు జాబితాలోని ఎపిక్‌ ఐడీ నంబరు, పార్ట్, సీరియల్‌ నంబర్లను వేసి ఇంటి చిరునామా రాసి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. డిసెంబరు 7 నాటి పోలింగ్‌ నిర్వహణలో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించే అవకాశం ఉంటుంది.  ఉద్యోగికి కేటాయించిన ఎన్నికల విధుల పత్రాన్ని జతచేసి పోస్టల్‌ బ్యాలెట్‌ను ఇస్తారు. దీనికి ప్రతి నియోజకవర్గంలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చేలా ప్రత్యేకంగా అధికారులను నియమించారు.

గత 2009, 2014 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఓటరు చైతన్యం కార్యక్రమాల మాదిరిగా పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగంపై కూడా చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

సద్వినియోగం చేసుకోవాలి..
పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఇప్పటి వరకు 367 దరఖాస్తులు స్వీకరించగా 179 బ్యాలెట్‌లను పంపించాం. ఈ నెల 25న పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి.    –విక్రంరెడ్డి, రిటర్నింగ్‌ అధికారి

పెరిగిన పోస్టల్‌ ప్రాధాన్యం
పటాన్‌చెరు టౌన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతీ ఉద్యోగి తన ఓట హక్కును వినియోగించుకునేందుకు గాను పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. ఈ నెల 25 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ స్వీకరించేందుకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. 

ఓటర్‌ ఐడీ గుర్తింపు కార్డుతో....
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఫాం–12ను కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 
దీనికి ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటర్‌ ఐడీ పత్రాలను జతపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధులో పాల్గొనే వారికి వీటిని అందించారు. ఇలా అందించిన వారి ఇంటికి పోస్టల్‌ బ్యాలెట్‌ వెళ్తుంది. లేదా ట్రేనింగ్‌కి వచ్చిన సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ అందిస్తారు.

ఓటు ఇలా వేయాలి.....
పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగి ఇంటి అడ్రస్‌కు వస్తుంది. అందులో బ్లూ, పింక్, ఎల్లో కలర్లతో కూడిన మూడు కవర్లు ఉంటాయి. వీటితో పాటు ఫాం–13 ఏ, బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయి. ఫాం–13 ఏలో పోస్టల్‌ బ్యాలెట్‌ నంబరు రాసి సంతకం చేసిన అవసరమైన ఒక చోట గెజిటెడ్‌ సంతకాలు చేసి బ్లూ కవర్‌లో పెట్టాలి. బ్యాలెట్‌ పేపర్‌లో ఏ అభ్యర్ధికి ఓటు వేయాలనే విషయంలో అభ్యర్థి పేరు వద్ద టిక్‌ పెట్టి ఆ బ్యాలెట్‌ను పింక్‌ కవర్‌లో ఉంచాలి. పై రెండు కవర్లను ఎల్లో కవర్‌లో పెట్టి సీల్‌ చేయాలి.

పటాన్‌చెరు టౌన్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులను పరిశీలిస్తున్న తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement