ఈ ఎయిర్‌పోర్టులో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు వీలుగా, భద్రతా అవసరాల నిమిత్తం ప్రాంగణానికి సమీపంలో అంటే.. 5నుంచి 6కి.మీ దూరంలోఉన్న 18 మీటర్లకంటే ఎత్తయిన భవనాలపై ‘ఎయిర్ క్రాఫ్ట్ అబ్ స్ట్రక్షన్ వార్నింగ్ లైట్స్’ ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ లైట్ల ఏర్పాటుతో పైలెట్లు బేగంపేట్ విమానాశ్రయంలో ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసే సమయంలో వారికి అక్కడ అత్యంత ఎత్తయిన భవంతి ఉన్న విషయాన్ని పసిగట్టే అవకాశం ఉంటుందని, ఈ ఆదేశాలన్నీ భద్రతా కోణంలో జారీ చేసినవని విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీ నడిబొడ్డున ఉన్న బేగంపేట్ విమానాశ్రయానికి మరింత క్రేజ్ పెరుగుతోంది. వీఐపీలు, వీవీఐపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వంటి ప్రముఖులు వినియోగించే చార్టర్ ఫ్లైట్స్ రాకపోకలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రతినెలా ఈ విమానాశ్రయం నుంచి వందలాదిగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విమానాశ్రయం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండడంతో వీఐపీలు, వీవీఐపీలు ఇక్కడి నుంచి ఇతర దూరప్రాంతాలకు బయలుదేరి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. అయితే, ఈ విమానాశ్రయానికి సమీపం (5–6 కి.మీ)లో సుమారు 18 మీటర్ల కంటే ఎత్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానులు ‘ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఏఏఐ) నుంచి ఆన్‌లైన్‌లో ఎన్‌ఓసీలు(నిరభ్యంతర పత్రాలు) పొందాలని తాజాగా ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ ఆదేశాలిచ్చింది.
రోజురోజుకు పెరుగుతోన్న రద్దీ
బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతితో పాటు పలు వురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు రాకపోకలు సాగించేందుకు ఇది అనుకూలంగా ఉండడంతో వారంతా ఈ ఎయిర్‌పోర్టుపై ఆసక్తిచూపుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో విమానాల రద్దీ పెరుగుతోంది. ఇక నగరానికి వచ్చే దేశ, విదేశీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ విమానాశ్రయంలోనే తమ చార్టర్ ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో నెలకు సుమా రు 300కు పైనే ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఫ్లయింగ్ క్లబ్స్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించే రక్షణశాఖ సైతం ఈ విమానాశ్రయం సేవలను తరచూ వాడుకుంటుండడంతో రద్దీ పెరుగుతోంది.
ఎన్‌ఓసీలకు దరఖాస్తు ఇలా..
విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఎత్తయిన భవంతుల యజమానులు భవనం ఎత్తు క్లియరెన్స్‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్‌ఓసీని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లో ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. ఈఎన్‌ఓసీలను ఉచితంగానే జారీచేస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆయా భవనాల యజమానులు తమ భవవతుల పూర్తి వివరాలు, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తదితర వివరాలను ఆన్‌లైన్‌లోనే పూరించాల్సి ఉంటుంది. ఇందుకోసం హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఓసీఏఎస్2.ఏఏఐ.ఏఈఆర్‌ఓ/ఎన్‌ఓసీఏఎస్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment