మంత్రివర్గంలో బెర్తు
కొత్త రాష్ట్రం.. ప్రభుత్వంలోని మంత్రివర్గంలో బెర్తు ఖరారు చేసుకోవాలని భావిస్తున్న వారి ఆశలు ఫలించలేలా లేవు. స్థానం సంపాదించాలంటే మరికొద్దిరోజులు ఎదురుచూపులు తప్పేలాలేవు. జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైనా ఈ నెల 2న ఏర్పాటైన మంత్రివర్గంలో చోటుదక్కలేదు. జిల్లా నుంచి ముగ్గురు శాసనసభ్యులు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికీ సామాజికవర్గ సమీకరణాలు అడ్డుగా నిలవడంతో ఇప్పట్లో మంత్రిపదవి దక్కే సూచనలేవీ కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన నేతలు కూడా నామినేటెడ్ పదవులు వేటలో ఉన్నారు. మరి ఎవరి ఆశ ఫలిస్తుందో చూడాలి..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:
జిల్లా నుంచి టీఆర్‌ఎస్ పక్షాన ఏడుగురు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (టీఆర్‌ఎస్) మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఇ ప్పటికే ఇదే సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో పెద్దపీట వేయడంతో జిల్లా కోటాలో పదవిని ఆ శిస్తున్న ఎమ్మెల్యేల ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. సీనియర్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావుకు సామాజి కవర్గ సమీకరణలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇదే సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్‌రావు, కేటీ రామారావు ఇప్పటికే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగబద్దంగా మంత్రివర్గంలో గరిష్టంగా 17 మందికి మాత్రమే మంత్ర ులుగా అవకా శం ఉండటంతో జూపల్లికి మంత్రి పదవి దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ముగ్గురు రెడ్డి సామాజి కవర్గానికి చెందిన మంత్రులుగా ఉన్నారు. దక్షిణ తెలంగాణ నుంచి ఇప్పటికే నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్), జి.జగదీశ్వర్‌రెడ్డి (నల్గొండ), మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి)కి రెడ్డి సామాజికవర్గం కోటాలో అవకాశం దక్కింది. మలి విడత విస్తరణలో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఇదే సామాజికవర్గం నుంచి పలువురు పోటీ పడుతుండటంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అవకాశం క్లిష్టతరం కానుంది.
మరోవైపు ఉద్యోగ సంఘం నేతగా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా మలివిడత మంత్రివర్గ విస్తరణపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఇదే సామాజికవర్గానికి చెందిన పద్మారావుగౌడ్ (సికింద్రాబాద్) మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రిపదవికి బదులుగా మరో కీలక పదవి కేసీఆర్ ఆఫర్ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామాజికవర్గ సమీకరణాలు కలిసి వస్తే అంజయ్య యాదవ్ (షాద్‌నగర్), గువ్వల బాల్‌రాజు (అచ్చంపేట)కు అవకాశం దక్కే సూచనలు వున్నాయి. కాగా, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 2009లోనూ టీఆర్‌ఎస్ తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.
నామినేటెడ్ పదవులపైనే ఆశలు
సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నేతలు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గద్వాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి లేదా ఏదైనా నామినేటెడ్ పదవి కోరుతున్నట్లు సమాచారం. జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీమంత్రి డీకే అరుణను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కీలక పదవి ఇవ్వాలనే వాదన వినిపిస్తున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు జి.జైపాల్‌యాదవ్, గట్టు భీముడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవర మల్లప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథ్ కూడా రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునే దిశగా ఏదైనా కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధినేతకు విన్నవించినట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన నేతలు కూడా నామినేటెడ్ పదవులు వేటలో బిజీగా ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే దిశలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.