సోదరుడి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని.. | Bhupalpally district 7 years old Reshma murder mystery solved | Sakshi
Sakshi News home page

మిస్టరీ వీడిన రేష్మ అత్యాచారం, హత్య కేసు

Published Wed, Dec 6 2017 5:27 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

Bhupalpally district 7 years old Reshma murder mystery solved - Sakshi

భూపాలపల్లి: జిల్లాలో  కలకలం రేపిన చిన్నారి రేష్మపై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. తన సోదరుడి చావుకు కారణమయ్యాడనే అక్కసుతో తండ్రిపై కక్ష కట్టి అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4 తేదీన పుట్టినరోజు నాడే ఏడేళ్ల చిన్నారి  రేష్మ హత్యకు గురై మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక కుమార్తె రేష్మ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతోంది.

గత ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్‌ సిస్టమ్ కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు. రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. మరుసటి రోజు రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు.

విచారణ చేపట్టిన పోలీసులు రేష్మ మృతికి కారకుడైన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే  ఆ చిన్నారిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కనకం శివ సోదరుడు  కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు అడ్డు పడటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో రాజు పై కక్ష పెంచుకున్న శివ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి డీఎస్‌పీ కిరణ్ కుమార్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement