మెదక్ (మిరుదొడ్డి) : ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా పరిధిలోని భూపాలపల్లి చౌరస్తాలో మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు చెందిన బీడీ కార్మికులు శనివారం రోడ్డు పై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. పీఎఫ్ నంబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి జీవనభృతి చెల్లించాల్సిందేనంటూ బీడీ కార్మికులు రోడ్డెక్కారు.
అన్ని అర్హతలు ఉండి కూడా జీవన భృతికి తాము అర్హులము కాదా అంటూ కన్నెర్ర జేశారు. విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. కొద్ది సేపు బీడీ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్నో సార్లు దరఖాస్తులు చేసుకున్నా తమకు న్యాయం జరగడంలేదని మండిపడ్డారు. అర్హులైన తమకు జీవన భృతి చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని భీష్మించారు.
భూంపల్లి ఎస్‌ఐ పి ప్రసాద్ కలగజేసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి చర్చిస్తానని నచ్చజెప్పడంతో బీడీ కార్మికులు శాంతించి ఆందోళనను విరమించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఆందోళనతో సిద్దిపేట-రామాయంపేట రహదారి ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోయింది. భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
'షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి'
Published Sat, Jun 27 2015 5:42 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement