సాక్షి, నల్లగొండ : ఇప్పటికి రెండుసార్లు ఊరించి ఉసూరుమనిపించిన విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ 1996, 2004 ఎన్నికల్లో రెండో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. కానీ, ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా విజయ తీరాలకు చేరాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తమను గట్టెక్కిస్తుందన్న భావనలో కమలనాథులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అవే అంశాలను ప్రచారస్త్రాలుగా వాడుకుంటోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన గార్లపాటి జితేంద్రకుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలిసే పనిలో ఉన్నారు. అభ్యర్థి గెలుపు కోసం ముఖ్య నాయకులను నియోజకవర్గంలో ప్రచారానికి తీసుకురానున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఇప్పటికే ఖరారు అయ్యింది. ఏప్రిల్ ఆరో తేదీన ఉగాది రోజే అమిత్ షా నల్లగొండలో రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ నాయకత్వం చెబుతోంది. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నల్లగొండ పర్యటనకు రాగా, జాతీయ అధ్యక్షుడి పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
రెండు సార్లు తప్పిపోయిన విజయం
జిల్లాలో తమకు పట్టుందని, దేశం మొత్తం నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావాలనుకుంటోందని, ఈ కారణంగానే ఈసారి బీజేపీకి అవకాశం ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇదివరకు రెండు పర్యాయాలు నల్లగొండ ఎంపీ స్థానంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ రెండు పర్యాయాలూ సీపీఐ చేతిలోనే ఓటమి పాలైంది. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్.ఇంద్రసేనారెడ్డి బరిలోకి దిగగా, సీపీఐ నుంచి బొమ్మగాని ధర్మబిక్షం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 71,761 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే మాదిరిగా 2004 ఎన్నికల్లో సైతం బీజేపీ నుంచి ఎన్.ఇంద్రసేనారెడ్డి రెండోసారి పోటీ పడగా, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి పోటీలో నిలిచారు.
ఆ ఎన్నికల్లో కూడా సీపీఐ విజయం సాధించగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 56,151 ఓట్ల తేడాతో అవకాశం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తమకున్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఎన్నికల్లో అంచనాలు వేస్తోంది. దేశభద్రత, సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ప్రధానిగా మోదీ పనితీరు, పుల్వామా సంఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వంటిì అంశాలను తమకు అనుకూలంగా భావిస్తోందంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకు పోలిక ఉండదని, అక్కడ ఎవరు ప్రధాని అవుతారు..? ఎవరి చేతిలో దేశ భద్రత భద్రంగా ఉంటుందన్న అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలు, వాటి పరిష్కారం బీజేపీ ఎంపీలతోనే ఎలా సాధ్యమో ప్రచారం చేస్తోంది. మొత్తంగా అమిత్ షా పర్యటనతోపాటు, యువతలో మోదీకి ఉన్న చరిష్మా వంటి అంశాలతో తమ అభ్యర్థి గట్టెక్కుతారన్న విశ్వాసాన్ని బీజేపీ నాయకత్వం వ్యక్తపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment