ఉద్యమంలో బీజేపీది పెద్దన్న పాత్ర
సూర్యాపేట : తెలంగాణ ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1969లో జరిగిన ఉద్యమంలో పోలీసు తూటాలకు 369 మంది బలయ్యారని, చివరిదశ ఉద్యమంలో 1200మంది బలయ్యారని పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రజలను బాగు చేస్తారన్న ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారన్నారు. కానీ ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంలా ఉందని ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విడుదల చేసిన నిధులు పాత బకాయిలకే సరిపోతాయని తెలిపారు. ప్రభుత్వం ఐదు నెలలుగా తూర్పు, ఉత్తరం దిక్కులపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుందే తప్ప, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించలేదని పేర్కొన్నారు. రూ.26వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌లు ఏర్పాటుచేస్తామని చెప్పి బడ్జెట్‌లో కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించారని, ఆవి ఏమూలకు సరిపోతాయని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని, హైదరాబాద్‌లో పూరిగుడిసె లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్, ఆ పథకానికి కేటాయించిన నిధులు ప్రతి గ్రామానికి రెండు ఇళ్లకే సరిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి విద్యుత్, సాగునీరు అందిస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు.
సమగ్రసర్వేతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రులను సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేందుకు కేవలం బడ్జెట్‌లో కోటి రూపాయలు కేటాయించడం సరికాదన్నారు. ఆస్పత్రిలో కొన్ని విభాగాలకు చెందిన మిషన్లకే రూ.కోటి అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉందని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసేలా కృషిచేస్తానని తెలిపారు. సమావేశంలో నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, చింతా సాంబమూర్తి, పాదూరి కరుణ, గోలి మధుసూదన్‌రెడ్డి, దాసరి మల్లేశం, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సునీత, అమర్‌సింగ్, ప్రేమ్‌రాజ్‌యాదవ్, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.