సాక్షి, సూర్యపేట: ‘‘కార్యకర్తల జోష్ చూసి కేసీఆర్ గుండెలు అదరాలి.. గుర్రంబోడు తండా ఇష్యూతో కేసీఆర్ బాక్సులు బద్దలయ్యాయి’’ అన్నారు బీజేపీ నాయకుడు బండి సంజయ్. సూర్యపేట బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బీజేపీలో మాత్రమే కార్యకర్తల స్థాయి నుంచి కేబినెట్ మంత్రి అవుతారు. కిషన్ రెడ్డి ఎన్నో కష్టాలను ఎదురించి గ్రామగ్రామాన పార్టీని బలపరిచారు. ఆయనను కేబినెట్ మంత్రిగా నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ప్రజలకు ఇచ్చిన హామీలను జాతీయ స్థాయిలో అమలు చెయ్యడంలో కిషన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.. ఎన్నో ఉద్యమాలు చేశారు’’ అని తెలిపారు.
‘‘27 మంది బీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం బీజేపీది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయకుండా ఆగమాగం చేసే వ్యక్తే కేసీఆర్. బీజేపీ పొగపెడితేనే కేసీఆర్ గడీల నుంచి బయటకు వచ్చారు. ఏడేళ్లుగా గడిలో నుంచి బయటకు రాని కేసీఆర్ బీజేపీకి బయపడి బయటకు వచ్చారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు, ఎస్సీలు ఉన్నారు.. కమీషన్లు వచ్చే పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్దనే ఉన్నాయి’’ అని విమర్శించారు.
‘‘రాష్ట్రంలో నియంతపాలన, అవినీతి పాలన, గడీల పాలన సాగుతోంది. తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో బంధీగా ఉంది. తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడం కోసం బీజేపీ మలిదశ ఉద్యమం చేస్తోంది. ప్రగతి భవన్, గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం. కాళ్లు, చేతులు విరిగినా వెనకడుగు వేయం. లక్ష్యం సాధించే వరకు కార్యకర్తలు విశ్రమించకూడదు’’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment